భూరితరాభ్ర విభ్రమము, పుష్కర రమ్య కరంబు, దాన ల
క్ష్మీ రుచిరంబు, సత్త్వగుణ కీర్తితమూర్తియు, వాలి సాల సం
హార విహార కారణమునౌ రఘుకుంజరభర్త మున్ను సం
చార మొనర్చె నీ యచల సానుతలంబున అంబుజాననా !
అగస్త్యుడు లోపాముద్రతో పాటు దక్షిణ దిక్కుగా పయనిస్తూ, మలయ పర్వత ప్రాంతాన్ని, మతంగ మహాముని ఆశ్రమాన్ని భార్యకు చూపించాడు. అక్కడున్న కొండలలో తిరుగుతూ, శ్రీరాముడు ఆ ప్రదేశంలోనే వానరరాజు వాలిని వధించాడని చెప్పాడు. ఆ విశేషాలే ఈ పద్యం లోని భావం.
ఈ పద్యంలో, అగస్త్యుడు రాముణ్ణి ' రఘుకుంజరభర్త ' అని సంబోధించాడు. అంటే రఘువంశ శ్రేష్ఠుడని అర్థం. సంబోధనలోని కుంజర శబ్దం ఏనుగు అనే అర్థాన్నిస్తుంది. దీని ఆధారంగా, రామకృష్ణకవి, శ్లేష నుపయోగించి, రాముని పరంగాను, ఏనుగు పరంగాను పద్యాన్ని రచించారు.
ముందుగా రాముని పరంగా పద్యార్థాన్ని అన్వయించుకొందాం.
" నీలమేఘవర్ణము కలది, తామరల వంటి అందమైన హస్తము కలది, దానము చేయుట చేత మిక్కిలి ప్రకాశించేది, సత్త్వగుణము వల్ల కీర్తింపబడిన మూర్తి కలది, వాలి అనే మద్దిచెట్టు వంటి బలాఢ్యుడైన వానరరాజు సంహారానికి విహారకారణం అగు శ్రీరామకుంజరశ్రేష్టము మునుపు యీ కొండలలో సంచరించింది. "
ఇప్పుడు, ఏనుగు పరంగా అర్థం చెప్పుకుందాం.
" మేఘం లాగా నల్లనైనదీ, చక్కని చివరి భాగము కలిగిన తొండము కలదీ, దానజలము సమృద్ధిగా కలిగినదీ, బలం వల్ల కీర్తింపబడినదీ, కొద్దిగా వంగి మద్దిచెట్లను విరుచునదీ, అగు రఘువు అనే గజరాజము యీ కొండలలో ఇక్కడ మునుపు సంచరించేది. "
ఏనుగు తొండము యొక్క చివరి భాగానికి పుష్కర మనే అర్థం ఉంది.
తెనాలి రామకృష్ణునికి క్రొత్త పదాలను ఎంపిక చేయడం, వాటికి క్రొత్త అర్థాలను సంతరింపజేయటం, ఒక సరదా, ఒక క్రీడ. ఆ విన్యాసం ' వాలి సాల విహార కారణమునౌ ' అన్న చోట కనపడుతుంది. అర్థాన్ని అన్వయించుకోవడానికి మెదడుకు మేత పెట్టాల్సివస్తుంది.
ఈ పద్యం తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము, ప్రథమాశ్వాసం లోనిది.
No comments:
Post a Comment