ఈ దృశంబుగ మహాకావ్యరచనా ప్రసూనవన బంభరాయమాణ చిత్తుండనై సర్వధర్మ మూలబీజంబుగ నవిచ్ఛిన్న సంప్రదాయార్థినై.
శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారికలోని ఈ వచనం ఎంతో ప్రాధాన్యత కలిగినది.
ఈ ఏకవాక్య వచనం మహాకవిగా విశ్వనాథ అంతరంగాన్ని బహిర్గతం చేస్తున్నది.
విశ్వనాథ రామాయణం ఎందుకు వ్రాయవలసి వచ్చింది? ఎవరికోసం వ్రాయవలసి వచ్చింది? ఒక మహాకవి రచనలు ఎవరికోసం, ఏ ఉద్దేశ్యంతో చేస్తాడు. ఇలాంటి పలు ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమౌతాయి. నాగరక సమాజమని పిలువబడే నేటితరంలో, రామాయణం చదువవలసిన అవసరం ఎవరికుంది? అసలు, నేటి తరానికి రామాయణం ఏమి చెబుతున్నది?
ఈ ప్రశ్నలకు సమాధానమా అన్నట్లు, విశ్వనాథ తాను రామాయణాన్ని " ఈ దృశంబుగ మహాకావ్యరచనా ప్రసూనవన బంభరాయమాణ చిత్తుండనై, సర్వధర్మ మూలబీజంబుగ నవిచ్ఛిన్న సంప్రదాయార్థినై " వ్రాస్తున్నానన్నాడు.
ఇందులోని కొన్ని పదాలను విశ్లేషణాత్మకంగా పరిశీలిద్దాం.
విశ్వనాథ, " మహాకావ్యరచనా ప్రసూనవన బంభరాయమాణ చిత్తుండనై " వ్రాస్తున్నానన్నాడు. పూలతోటలోని మధువులొలికే పూల మీదనే తుమ్మెదలు వ్రాలతాయి. పిచ్చి మొక్కల పూల జోలికి పోవు. మహాకావ్యమనేది పరిమళభరితమై, పొట్టనిండా మధువును నింపుకొన్న పూలు గల పూదోట. ఆ పూదోటను ఫలవంతం చేయాలంటే విశ్వనాథ వంటి గాఢప్రతిభ కలిగిన మహాకవి కావాలి. విశ్వనాథ మహాకవి. ఆయన చేబట్టినది మహాకావ్యరచన.
మహాకావ్యరచన ఎందుకు చేయాలి? సర్వధర్మమూలబీజంబుగ అవిచ్ఛిన్న సంప్రదాయార్థిగా చేయాలి. అనగా సర్వధర్మములకు మూలసూత్రముగా నిరంతరం కొనసాగే సంప్రదాయం ఒకటుండాలి. అది దేశకాలాతీతమై, మానవాళికి ఆనందసంధాయకంగా, అభ్యుదయకారిగా ఉండాలి. ఇక్కడ సర్వధర్మములకు అంటే అన్ని మతములకు, వర్ణములకు, వర్గములకు, అతీతంగా, బీజప్రాయంగా ఒకటుండాలి. అది నిత్యమై, మార్పు లేనిదై కొనసాగాలి. అదే అవిచ్ఛిన్న సంప్రదాయం. అది అనాదిగా, ఋషిమార్గంగా, సనాతనంగా వస్తున్నది. దానిపేరే ధర్మము. యుగాలు మారినా, తరాలు మారినా, ఈ సనాతనధర్మం అవిచ్ఛిన్నంగా సాగాలన్నది విశ్వనాథ ఆకాంక్ష.
నేటి సమాజానికిది అవసరమా? గతించిన తరాల కన్నా, నేటి తరాలకే ఈ సంప్రదాయం యొక్క, ఈ సనాతన ధర్మం యొక్క అవసరం ఎక్కువ. నాగరకత, ఆడంబరాలు, స్వప్రయోజనాలు, ప్రచారాలు, లాభార్జన ఇత్యాది విషయముల సుడిగుండంలో పడి యువత కొట్టుకుపోతున్నది. మానవీయ విలువలను మరచిపోతున్నది. అటువంటి తరుణంలో, విశ్వనాథ రామాయణాన్ని మరల వ్రాశారు. ఆచార్య జీ.వీ.సుబ్రహ్మణ్యం గారన్నట్లు నవ్యసంప్రదాయంలో వ్రాశారు.
రామాయణ కావ్యానికి కథానాయకుడు రాముడు. రాముడు తాను " జ్ఞానపథవిహారి " నని చెప్పుకొన్నాడు. జ్ఞానం యొక్క మార్గం ధర్మానుష్ఠానం. అనగా ధర్మాన్ని ఆచరించటం. ఆచరించి ఇతరులకు మార్గదర్శిగా ఉండటం. రామావతార లక్ష్యమే ధర్మ పరిరక్షణ. " రామో విగ్రహవాన్ ధర్మః " అని ఐంద్రజాలికుడైన మారీచుని వంటి రాక్షసుని చేత పలికించారు వాల్మీకి. రామాయణంలోని రాముని ప్రతి అడుగూ ధర్మం కోసమే. " ధర్మో రక్షతి రక్షితః ". ధర్మమే మానవుని మనుగడకు మూలస్తంభం. మూలస్థంభం ఒరిగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మానవాళి మీద ఉంది. అది జరగాలంటే, అవిచ్ఛిన్నంగా సంప్రదాయాన్ని కొనసాగేటట్లు చేయాలి. ధర్మ మూలబీజంబుగా, ఆ అవిచ్ఛిన్న సంప్రదాయాన్నే విశ్వనాథ తన రామాయణ రచన ద్వారా అర్థించింది.
అందుకే, " పక్షి ఆకాశంలో ఎంత ఎత్తుకు ఎగిరినా, రాత్రి గూటికి చేరవలసిందే. అదే సంప్రదాయం. " అన్నారు విశ్వనాథ.
No comments:
Post a Comment