మంగళరూప ! యయ్య! హరిమర్కటమర్కట ! పంచవక్త్ర ! ఖ
ట్వాంగ మహాసిఖేట కుధరామృతకుంభ సృణి ప్రదీపితో
త్తుంగ కరాంబుజాత ! నవతోయదమూర్తి ! త్రిపంచనేత్ర ! స
ర్పాంగదకంఠహార ! యసురావళిమర్దనబాహు ! మారుతీ !
ప్రాసంగ్యోత్థ కకుద్భుజావనత ! సర్వజ్ఞా ! సమీచీన బా
హా సంపాదిత రామకార్య ! దితిసూహా ! నిత్యతృప్తా ! స్వతం
త్రా ! సింహానన ! వైనతేయ ! చటులాస్యా ! యగ్నిగర్భా ! మహా
త్మా ! సర్వగ్రహభీనివారణ ! సముద్రాంభో మహాపత్తరీ !
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండములోని ఈ రెండు పద్యాలు ఆంజనేయుని వర్ణనకు సంబంధించినవి. ఆకాశమార్గంలో, సముద్రాన్ని దాటి లంక దిక్కు గా పయనిస్తున్న ఆంజనేయుని దివ్యవిగ్రహాన్ని చూసి, భావనాసమాధిస్థితుడై శచీపురందర ఋషి చేసిన స్తుతి ఇది. ఈ పద్యాలలో ప్రసన్నాంజనేయ స్తుతితో పాటు పంచమూఖాంజనేయ స్తుతి కూడా ఉన్నది. అన్నిటికంటె ముఖ్యంగా, రామకార్యార్థియై వెళ్తున్న హనుమంతునికి కార్యసాఫల్యం కలగాలంటే, ఆ మహానుభావుడికి స్వస్వరూపజ్ఞానం కలగాలి. ఈ స్వస్వరూపసంధానం కలిగించటానికి నాంది కిష్కింధా కాండం చివరలోనే జరిగింది. సర్వ దేవతలు, సిద్ధులు, సాధ్యులు, ఋషులు భావనాసమాధిస్థితిలో హనుమ స్వస్వరూపసంధానం పొందడానికి ధ్యానం చేశారు. విశ్వనాథ అక్కడ మొదటిసారి ఈ పద్యాలను వాడారు. ఇది అద్భుతమైన శిల్పరచన. ఎప్పుడైతే ఆంజనేయునికి తన బల మేమిటో తెలిసిందో, అప్పుడు ' త్రుటిలో లాంగూల మాభీల జిహ్మగ పుచ్ఛోగ్ర విచాలనాద్భుత రవవ్యాదీర్ణ రోదోంతరంగంబుగ సంతాడన ' మాచరించాడు. మహేంద్రగిరి నెక్కాడు. అప్పుడు
" కెవ్వున గీపెట్టె క్షితిధరం బంతఁ బం
చాస్యంబు మదకుంభిఁ చఱచినట్లు "
అదీ ఆంజనేయుని యొక్క మహాద్భుతమైన శక్తి...
ఈ రెండు పద్యాలలో, విశ్వనాథవారు తమ ఉపాసనాబలంతో, పంచముఖాంజనేయ మంత్రాలను నిబంధించారని పెద్దలు చెప్పగా విన్నాను. ఈ పద్యముల లోతైన మంత్రార్థాలను మహాపండితులు, ఉపాసకులు చెప్పవలసిందే కానీ, నా వంటి వారికి సాధ్యం కాదు. అయినప్పటికీ, ఆంజనేయ ప్రార్థనలో నేను చదువుకొనే ఈ ప్రసిద్ధ పద్యాలకు, కనీసం నావంటి అల్పజ్ఞుల అవగాహన కొరకు, ఈ పద్యాల అర్థాన్ని వివరించటానికి ప్రయత్నం చేస్తున్నాను.
" ఓ వాయునందనా ! నీవు శుభప్రదమైన రూపము గలవాడివి. గౌరవింపదగినవాడివి. హరిమర్కటమర్కట మంత్రస్వరూపుడవు. పంచముఖాంజనేయమూర్తివి. ఖట్వాంగము అనే శివాస్త్రము, పదునైన ఖడ్గము, కుధరము (డాలు), అమృతకుంభము, అంకుశము మొదలుగా గల ఆయుధాలను ధరించినవాడివి. తెలిమబ్బుల ఛాయ కలవాడివి. ఒక్కొక్క ముఖమునందు త్రినేత్రములు కలిగిన శివస్వరూపుడవు. సర్పములను కంఠమునందు, దేహము నందు ఆభరణములుగా ధరించిన పరమేశ్వరస్వరూపుడవు. దైత్యులను మర్దించే ఘనమైన బాహువులు కలిగినవాడవు.
ప్రసంగ సమయంలో కొద్దిగా వంగిన బుజములు కలిగినవాడివి. సర్వజ్ఞుడివి. రామకార్యదీక్షాపరతంత్రుడవు. దైత్యమర్దనుడవు. నిత్యతృప్తుడవు, మహాయోగివి. స్వతంత్రుడవు. నారసింహస్వరూపుడవు. గరుత్మంతుని స్వరూపుడవు. అగ్నిముఖుడవు, అగ్నిగర్భుడవు. గొప్ప ఆత్మవిదుడవు. గ్రహపీడను తొలిగించేవాడివి. సముద్రమనే మహాకాశాన్ని దాటుతున్నవాడివి. "
అని ఈ విధంగా, శచీపురందర ఋషి, సర్వదేవతలు. సర్వ ఋషులు, భావనాసమాధిస్థితులై, ఆంజనేయుని కార్యసాఫల్యం కోసం ధ్యానం చేసారు. ఇదేవిధంగా, సీతాన్వేషణ కాలంలో, ఎప్పుడెప్పుడు హనుమ తీవ్రమైన మానసికాందోళనకు గురయ్యాడో, అప్పుడు, శచీపురందరమునితో సహా, సర్వదేవతలు, ఋషులు, హనుమకు కార్య సాఫల్యం కలగాలని ధ్యాననిమగ్నులై ఉండటం గమనిస్తాము. ఆంజనేయుని అద్భుతమైన విరాట్ దర్శనం పుర్వరాత్ర ఖండంలో ఒక ముఖ్యమైన ఘట్టం.