పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః
యచ్ఛ్రేస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం.
కృపణత్వోపహతస్వభావుడను, నే పృచ్ఛింతునో! కేశవా !
యిపుడే ధర్మవిమూఢ చేతసుడ, నర్థింతున్ నినున్ శిష్యుడన్
ద్రపచేతన్ శరణంచు నుంటిని, సుహృద్భావా ! ప్రసన్నుండవై
యుపదేశింపుము నాకు నిత్యమగు శ్రేయోధర్మ మార్గంబునున్.
ఆకలైనవాడికే అన్నం పెట్టాలి. అవసరమైనవాడికే దానం చేయాలి. అడిగినవాడికే చెప్పాలి. అర్జునుడికి ఆత్మజ్ఞానం తెలుసుకోవాలనే ఆకలయింది, అజ్ఞానం పోగొట్టుకొనవలసిన అవసర మొచ్చింది. అందుకని, ఎవరినైతే అడగాలో వారినే అడిగాడు. అర్జునుడు కర్తవ్యనిర్వహణ సమయానికి ధర్మసమ్మూఢచేతసు డయ్యాడు. ధర్మం విషయంలో సందేహం కల మనస్సుకలవా డయ్యాడు. ఆ సందేహం తీరితే ఆకలి తీరినట్లవుతుంది. అప్పటిదాకా నిద్ర కూడా పట్టదు. ఇది ఉత్తముల విషయంలో నిజం. అర్జునుడు సామాన్యుడు కాడు. అతడు మహాపురుషుడు. కానీ ఒక లోపంతో బాధపడుతున్నాడు.
లోకంలో, పలువురు పలు దోషాలతో బాధపడుతుంటారు. కొందరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి. వారు కామోపహతులు. కొందరికి కోపం ఎక్కువగా ఉంటుంది. వారు క్రోధోపహతులు. అర్జునుడు కార్పణ్యదోషోపహతుడు. అర్జునుడికి కార్పణ్యదోషం ఉంది. కార్పణ్యమంటే లోభత్వం, దారిద్ర్యం, అజ్ఞానం అనే అర్థాలున్నాయి. అర్జునుడు, చిన్న దోషం కలిగి ఉన్నా, సత్పురుషుడు కనుక, మనం అతడు అజ్ఞానమనే దోషంతో, ఆత్మజ్ఞానశూన్యమనే దోషంతో బాధపడుతున్నాడని అన్వయించుకోవాలి. అజ్ఞానమనేది ఒక చిన్న పొరలాంటిది. పొర తీసేస్తే అజ్ఞానం తొలగిపోతుంది. ఆ పొరను తొలగించాలంటే వైద్యుడు కావాలి. కంట్లో శుక్లం వస్తే మనకు మనమే తొలగించుకోలేము. ఆ పనిని కంటివైద్యుడు చేస్తాడు. ఆ కంటివైద్యుడే పరమాత్మయైన శ్రీకృష్ణుడు.
అయితే, ఆ కంటివైద్యుడికి ఉన్న సంగతిని చెప్పి, కంటిలోని పొరను తొలగించమని, మరల చూపును ప్రసాదించమని అర్థించాలి. అదే చేశాడు అర్జునుడు. ఏది తనకు మంచి చేస్తుందో అది చెప్పమని శరణువేడాడు. శ్రీకృష్ణుణ్ణి గురువుగా స్వీకరించి, తాను అతడి శిష్యుడి నన్నాడు. పరమార్థం ఉపదేశించ మన్నాడు.
శరణాగతిని కోరిన శిష్యుని యెడల గురువు ప్రసన్నుడౌతాడు, మహదానందభరితుడౌతాడు. మన పెద్దలు చెబుతుంటారు " అడగందే చెప్పకూడదని, అడిగిన తరువాత చెప్పకుండా ఉండకూడదని. "
కృపణత్వంచే (అజ్ఞానం) ఉపహతస్వభావుడైన (కొట్టబడిన, వికలమైన, మలినమైన మనస్సు కలవాడైన) ధర్మసమ్మూఢచేతసుడు ( ధర్మ విషయంలో సందేహం కలిగిన మనస్సు కలవాడైన), శిష్యస్తేహం ( నేను నీకు శిష్యుడను), త్వాం ప్రపన్నం (నిన్ను శరణు పొందుతున్నాను) అన్న అర్జునుడికి ఆత్మజ్ఞానం బోధించాకుండా సద్గురువు ఎలా ఉండగలడు? ఆ విధంగా జగద్గురువు యోగ్యుడైన, జిజ్ఞాసువైన శిష్యునికి తత్వాన్ని ఉపదేశించిన ఫలితంగా శ్రీమద్భగవద్గీత మానవాళికి దక్కింది.
ఇది రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగంలో ఏడవ శ్లోకం.