లీలగ మీరు లోకమును లెక్కయె చేయరు, మీకు సర్వముం
దేలికగాఁ గనంబడును దీర్పని కార్యము తీర్చినట్లుగా
బోలు నపారశక్తిగల బుద్ధికి, మా యెడ నట్లు గాదు, ప్రా
ణాలును బ్రాప్తకార్యకరణంబును తూనిక పట్టినట్లుగా.
సుగ్రీవుని సందేహాన్ని నివృత్తి చేయటం కోసం, రాముడు సప్తతాళ భంజనమనే అద్భుతమైన కార్యం చేసి అతనికి నమ్మకం కలిగించాడు. అయితే సోదరులతో తనకు గల గాఢానుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని, " దయ అనేది లేకుండా, సిగ్గుపడేటట్లుగా, సోదరుల మధ్య అంత వైరం ప్రబలి, తమ్ముడివైన నిన్ను వాలి, ఆ విధంగా వెంబడించడానికి, నీవేమి తప్పు చేశావు? " అని రాముడు సుగ్రీవుడిని అడిగాడు. రాముని ఆ మాటతో, రాముని ఔదార్యం, వాలి మీద కృపగా మారుతుందేమోనని భయపడ్డాడు సుగ్రీవుడు. అందుచేత, సుగ్రీవుడు రాముడితో ఇలా అన్నాడు.
" మీరీ మాటనటానికి నే నాయనకు ఒక అపకారమని చేస్తే కదా ! విపరీతబుద్ధి కల వాలి మనం ఏం చేయకుండానే ఏదేదో ఊహించుకుంటాడు. నేనతడిని బ్రతిమాలాను, బామాలాను న న్నపార్థం చేసుకోవద్దని. దుందుభిని వధించిన అతడి బలపరాక్రమాలను మెచ్చుకొన్నాను. నేను తెలియక చేసిన పొరపాటును మన్నించమన్నాను. అతడివన్నీ తల కెక్కించుకొంటే గదా !
ఆయనకు ఒకడిపై విరోధం, ఇంకొకడిపై కోపం అనేవి ఉండవు. వాలి వంటి వారికి, వారి పదవి మీద ఉన్నంత అభిమానం ఇంకొక దాని మీద ఉండదు. రామా ! నేను చెప్పేది పూర్తిగా వినండి. ఆ తరువాత, నాది తప్పని మీకనిపిస్తే, అప్పుడు వాలినే సమర్థించండి. "
సుగ్రీవుడు అతిలోక ప్రజ్ఞా విశేషాలున్న వారి ఆలోచనా విధానానికి, సామాన్య లోక వ్యవహారానికి గల తారతమ్యాన్ని యీ పద్యంలో వివరించాడు.
" రామా ! మీరు అపారమైన శక్తిసామర్థ్యాలు, బుద్ధి విశేషం ఉన్నవారు. మీరు లోకాన్ని లెక్క చేయరు. లో కంలోని సర్వవ్యవహారాలు మీకు తేలికగా కనపడతాయి. జరుగని పని జరిగినట్లుగా మీకు కనపడుతుంది. మా విషయం అట్లా కాదు. మా ప్రాణాలు, మాకు ప్రాప్రమయ్యే ఫలితాలు తూనిక పట్టినట్లుగా ఉంటాయి. "
రాముడు ధర్మమూర్తి. విశ్వనాథ అవతారికలో చెప్పినట్లుగా, అతడి సోదరులు రాముడి ఊహలను అనుసరించి నడచుకొనేవారు. అంతటి గాఢానుబంధం వారిది. అందువలననే, వాలి " కృపమాలి వెంబడింపగ ద్రపమాలినయట్టు లన్నదమ్ముల మధ్యన్. " అని ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. రామునికి, అతని సోదరులకు మధ్య నున్న బంధం లోకాతీతమైనది. ఇక సుగ్రీవుడు చెప్పింది లోకవ్యవహారం గురించి. లోకంలో, రామసోదరుల మధ్య నున్నంత గాఢబంధం లేదన్నది అందరికీ తెలిసిన విషయం.
ఇక రెండవ విషయం, విశ్వనాథ కథాకథనానికి సంబంధించినది. సోదరుల మధ్య అంత వైరం ప్రబలటానికి కారణమడిగి, సుగ్రీవుని చేత దుందుభి యొక్క తదనంతర కథను చెప్పించటం, విశ్వనాథ కథాశిల్పానికి నిదర్శనం.
లోకాతీతమైన విషయానికి, లోకవ్యవహారానికి సంబధించిన యీ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, నూపుర ఖండము లోనిది.
No comments:
Post a Comment