కడవఁగ రాయబారము సుఖంబవుఁ గేవలనీతిమంతుఁ డె
క్కుఁడు భుజశాలి శౌర్యమునకున్ ములుసూపుచునుండు శౌర్యవం
తుఁడు మతినీతిమంతుఁడయి తోడ జితేంద్రియుడైనఁగాని చొ
ప్పడదు నృపాలకార్యము శుభప్రతిపాదికమై సుఖాంతమై.
రాతిరి సూర్యదేవుఁడు కరప్రకటోగ్ర సహస్ర మండలం
బాతత శౌర్యవంతుఁడునునై యుపసంహృతిచేసి చంద్రమ
స్స్ఫీత మనోజ్ఞ బింబమున జేర్చెడునట్టుల రాయబారి తే
జ్యోతివిలీనుఁడై చనుటయందుఁ బ్రసన్నత సంగ్రహించెడున్.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండం లోని ఈ పద్యాలలో విశ్వనాథ హనుమంతుని నోట రాయబారి యొక్క కర్తవ్య నిర్వహణను పలికిస్తూనే, కార్యసాఫల్యత కోసం, అతనికి ఉండవలసిన విశేష లక్షణాలను కూడా వివరించారు.
" నిజానికి రాయబారమనేది సుఖమైనది. అతడు నీతివంతుడైతే చాలు. కానీ, రాయబారికి బుద్ధివిశేషంతో పాటు, భుజబలం కూడా అధికంగా ఉంటే, అతడు భుజబలం చూపటానికి మొగ్గు చూపుతాడు. అందుచేత, శౌర్యవంతునికి, బుద్ధిబలంతో పాటు, జితేంద్రియత్వం కూడా ఉండాలి. రాయబారికి తన ఇంద్రియాల మీద అదుపు ఉంటేనే గాని, రాజు తన కప్పగించిన పని శుభప్రదమై సుఖాంతం కాదు.
సూర్యభగవానుడు తన తీక్ష్ణమైన కిరణముల కాంతితో ప్రకాశించే సహస్రమండల మధ్యస్థుడైనప్పటికీ, రాత్రివేళ మాత్రం తన కాంతిని మనోజ్ఞమైనటువంటి చంద్రమండలం లోనికి మరలిస్తాడు. అదేవిధంగా రాయబారి తన శౌర్యాన్ని బహిర్గతం చేయకుండా చరించటం సంతుష్టికరంగా ఉంటుంది. "
హానుమంతుడు నీతిశాస్త్రవిశారదుడు, మహాబలపరాక్రమశాలి, జితేంద్రియుడు, మహాయోగి. అందువలననే, సుగ్రీవుడు దక్షిణ దిక్కునకు అతనిని పంపటం జరిగింది. సీతాన్వేషణ, హనుమ వంటి బుద్ధిమదగ్రగణ్యుడి వలననే సాఫల్యమౌతుందని, వానరులలో గౌరవనీయుడు, పెద్దవాడైన జాంబవంతునికి కూడా తెలుసు. సుందర కాండము సుందరంగా ఉండటానికి హనుమ బహుముఖీనమైన ప్రతిభావిశేషాలే కారణం.
No comments:
Post a Comment