నిచ్చి సభా బహిష్పథము నీడిచి యంత వియత్ప్రదేశ వే
గోచ్చలదాత్మ దేహుఁడయి యుప్పరమందున వారికంఠముల్
వ్రచ్చి ధరం బడన్ విసరి వార్షుక ఘోర వలాహకక్రియన్.
ఉఱిమి నేనెవండ నోరి పంక్తిగళా ! క
పీశ్వరుండు వాలి యింద్రసుతుఁడు
నీ వెఱింగినట్టి నిర్భరబలశాలి
యతని యాత్మజుండ నది యెఱుఁగవొ?
అరరే ! నే నెవడన్ బలాధికబలుండౌ వాలిసూనుండఁ దా
నరరే ! నేనెవఁడన్ మరుత్సమజవుండౌ హన్మ శిష్యుండ, న
నన్నుర బంధింపఁ దలంతు నీవు నొక తన్నుం దన్ని ప్రాసాద శే
ఖరమున్ గూల్తున్ నీదు మస్తకమునుంగా రాము బాణంబుచే.
శ్రీరాముని దూతగా అంగదుడు రావణుని దగ్గరకు వెళ్ళాడు. దైత్యరాజు, మంత్రులు, సేనానులతో కొలువున్న నిండు సభలో, రాముని సందేశాన్ని వినిపించాడు. ఇంతదూరం వచ్చాడు కనుక, తాను చెప్పేది కూడా కొంచెం వినమన్నాడు. జగత్తుకు మాతాపితరులైన సీతారాములను విడదీయటం తప్పన్నాడు.
అంతా విన్న రావణుడు అంగదుడిని వధించమని తన భటులను ఆజ్ఞాపించాడు.
" అంగదుడు భయంతో వణికిపోతున్నట్లు నటిస్తూ, వాళ్ళు తనను పట్టుకోనిచ్చి, శ్రీఘ్రంగా వాళ్ళను కోట బయటిప్రదేశానికి ఈడ్చుకొచ్చి, మహావేగంతో ఆకాశవీధికి ఎగిరి, ప్రళయకాలంలో వలాహక మేఘం క్రమ్మినట్లు వారిని చుట్టబెట్టి, వారి మెడలను ఖండించి భూమిపై పడేశాడు.
" ఓరీ ! దశకంథరా ! నేనెవరినో నీకు తెలియదురా ! నిన్ను మూడు చెరువుల నీళ్ళుత్రాగించిన మహాబలశాలి, ఇంద్రుని కుమారుడైన, వాలి కొడుకుని రా ! " అంటూ రావణుడి వంక ఉరుముతూ చూశాడు.
అరరే ! నే నెవడనుకున్నావురా ! మహా బలసంపన్నుడైన వాలికి కొడుకునిరా ! అరరే ! నే నెవడినిరా ! వాయుదేవుడంత శక్తిసంపన్నుడైన హనుమంతుడి శిష్యుడినిరా ! నన్ను బంధించాలనుకుంటవురా ! ఒక్క తన్ను తన్ని, రాముడు బాణంతో నీ తల తెగ్గొట్టినట్లు, నీ సౌధశిఖరాన్ని కూలుస్తాను జాగ్రత్త ! "
రావణుడిని రాముడే సంహరించాలి. అది అంగదునికి తెలుసు. అందుకే, రామబాణంతో తల తెగ్గొట్టినట్లు, సౌధాగ్రాన్ని కూలుస్తానన్నాడు. అభిమానధనుడికి, పౌరుషవంతుడికి అంతకంటె అవమానం వేరే లేదు.
అంగదుడు, పిట్ట కొంచెం, కూత ఘనమన్నట్లు, మహా పౌరుషవంతుడు, బలవంతుడు. అతడు మాట్లాడిన తీరు జనసామాన్యం మాట్లాడినట్లుగా ఉంది. లోకంలో కూడా, పౌరుష మొచ్చినప్పుడు, ఒక్క మాటనే రెట్టించి మాట్లాడుతాము. దానినే, విశ్వనాథ అద్భుతంగా ఛందోబద్ధం చేశారు.
అందుకే విశ్వనాథ సగర్వంగా " ఈ తెల్గుమేల్ నుడికారమ్ములు దేశ్యముల్ పలుకుబళ్ళున్ జాతి మాట్లాడు కైవడి సత్కావ్యములొప్పు నాంధ్రమున, నా రామాయణం బట్టిదే. " అనగలిగారు.
అంగద రాయబారం లోని యీ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండములో ఉన్నాయి.
No comments:
Post a Comment