రాముఁడె యెల్ల నా బ్రదుకు రాముఁడు నన్నును గన్నతండ్రి యీ
రామువినా నిమేష మవురా ! మనఁజాలను కాదయేనియున్
రాముని వీడి యీ యఖిల రాజ్యముఁ గైకొనరాదె కైకయీ !
కోపగృహంలో ఉన్న కైక, భర్తకు ఇదివరకటి వరాలు గుర్తుచేసి, అవి తీర్చమని పట్టుబట్టింది. ఇక దశరథుడు, తను అమితంగా ఇష్టపడే భార్యను సంతోష పెట్టటానికి, రాముని మీద ఒట్టు పెట్టుకొని, ఆ వరాల నిస్తానన్నాడు. రాముడిని వనవాసానికి పంపటం, భరతుడికి రాజ్యాభిషేకం చేయటం అన్న యీ రెండు కోరికలను విన్న దశరథుడు పచ్చని చెట్టు మీద పిడుగు పడ్డ విధంగా కుప్ప కూలిపోయాడు. బ్రతిమాలినా, ప్రాధేయపడినా, పట్టువిడవని కైకను ఒప్పించటానికి, భరతునికి సర్వ రాజ్యాన్ని ధారాదత్తం చేస్తానని, రాముడిని అడవులకు పంపవద్దని అర్థించాడు. చూడండి.
" ఓ కైకేయీ ! రాముడే నాకు స్నాన, జప, ధ్యానాదులు. నా బ్రతుకంతా నా చిట్టి తండ్రి రాముడే. రాముడిని విడిచి నే నొక్క నిముషం కూడా ఉండలేను. ఇక నీవు కాదు కూడదంటే, రాముడిని అడవులకు పంపే మాట వదిలిపెట్టి, ఈ రాజ్యం మొత్తాన్ని తీసుకోరాదా ! "
పద్యం లోని భావం సువిదితమే. కానీ, కరుణ రసాత్మకమైన దశరథుని ప్రతి మాట, పఠిత యొక్క గుండె లోతులను తాకి, కన్నీటి ధారలను కురిపిస్తుంది.
దశరథుడికి అన్నీ రాముడే అనటంలో " జీవుని వేదన " కనిపిస్తుంది. దశరథుడు జీవుడైతే, రాముడు ఆత్మ. ఆత్మను విడిచి జీవునికి మనుగడ లేదు. అందుకే " రాము వినా నిమేష మవురా ! మనజాలను " అని దశరథుడు అనటం గమనార్హం.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోనిది.
No comments:
Post a Comment