చెడుకల వచ్చె నాకు నభిషేకము వద్దనినట్లు రాముఁడి
ప్పుడు తెలిసెన్ సమస్తశుభమూర్తికి రామున కేమి లోపమే?
నడు నడు ! సర్వభూషణసనాథత నూతననూతనాకృతిన్
వడివడిఁ బోయి బాలుని శుభంబుఁ గనుల్ తెరదీయఁ జూచెదన్.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండంలో, విశ్వనాథ కైకేయి పాత్రను తీర్చిన తీరు ఎంతచెప్పినా తనివితీరదు.
రాముని అభిషేక వార్త విన్న మంథరకు పాము విషం తలకెక్కినట్లయింది. ఎకాయెకిన కైకేయి దగ్గరకు వచ్చి, అర్థనిద్రలో ఉన్న కైకను లేపి, " అవునె దౌర్భాగ్య మాకారమైన దాన ! నీకు నిద్దుర యెటుపట్టునే దరిద్రురాల ! " అని నిలదీసింది. క్రితం రోజు వరకు అభిషేకం ఊసే లేదు, మరుసటి రోజే అభిషేకమని ముహూర్తం పెట్టేటంత తొందరేమొచ్చిందని, భరతుడు మేనమామ ఇంటికి వెళ్ళినపుడు, ఇంత దొంగచాటుగా యీ పని చేయవలసిన అవసరం మేమొచ్చిందని సూటిగా అడిగింది. కైకకు నెత్తిమీద పెద్దమ్మ వచ్చి కూచున్నట్లుంది, అందుకనే నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నది అని ఆడిపోసింది. రాముడు రాజైతే, మంథరకే కాదు కైకకు కూడా స్వతంత్రంగా తినటానికింత కూడైనా ఉండదని, ఇక ఎప్పటివో పాతకక్షలనీ తవ్వి తీస్తాడని నూరిపోసింది.
ఈ రకంగా చెబుతున్న దాది మాటలు వినీవినకుండా, అర్థనిద్రలో నుంచి మేలుకొని, సంతోషంతో విప్పారిన ముఖంతో, " అమ్మయ్య ! రాముడు అభిషేకానికి ఒప్పుకున్నాడు కదా ! " అని అడిగింది. ఆ సంతోషంలో కైక ఇంకా ఇలా అన్నది.
" మంథరా ! రాముడు అభిషేకం వద్దన్నట్లు నాకొక పీడకల వచ్చింది. నువ్విప్పుడు అభిషేకం సంగతి చెప్పగానే, నాకు తెలిసింది. సర్వలక్షణసంపన్నుడు రాముని కేమి లోపమే? పద పద. తొందరగా వెళ్ళి, సర్వాలంకారభూషితుడైన రాముని సుందరాకృతిని కనులారా చూడాలి. "
చెవిలో ఇల్లు కట్టుకొని ఇంత చెప్పినా, కైకేయి మనస్సుకు మంథర మాటలు ఎక్కలేదు. అందుకనే, ఆమె వినీవిననట్లుగా ఉంది. " ఇంత హడవుడిగా రేపు ప్రొద్దునే రాముని అభిషేకానికి అంత తొందరేమిటి? " అని మంథర అడిగిన ప్రశ్నలో నుండి, రాముడు అభిషేకానికి అంగీకరించాడన్న సమాధానపూర్వకమైన అంశమే ఆమెకు అమితానందాన్ని కలిగించింది.
అయోధ్యా కాండములో, విశ్వనాథ కైకేయి పాత్రను పొరలు పొరలుగా పాఠకుని ముందుంచి, ఆమె ఉదాత్తతను హృదయానికి హత్తుకొనేటట్లుగా పతాకస్థాయికి తీసుకువెళ్ళారు.
No comments:
Post a Comment