కృతసంస్మేరుఁడు రామచంద్రుఁడనె సుగ్రీవా ! మఱిన్ జీవి సం
స్కృతి చిత్రంబగు మూలభూతమగు దుష్కృత్యంబు ప్రాణంబు నం
దతుకున్ బ్రాణియొనర్చు సర్వమగు కార్యంబందు దీపించు బో
కృతులౌ మౌనులు సూక్ష్మదర్శులును దర్శింపంగ మూలాఘమున్.
మఱియును నవ్వి శ్రీరఘుకుమారకమౌళి ధనుర్దరిద్రమీ
ధరణి మహావిచిత్రముగదా యిది మీకును వాలి నేర్పటం
చురవడి నమ్ముదూసి పతి యొక్కటి చిత్రవిచిత్రవేగ బం
ధురతర తీవ్రచంక్రమణ ధూననవైఖరి నేసినంతటన్.
ఒక విచిత్రమైన ఖడ్గక కేళియో యనంగ
ఫుల్లపత్రావళిన్ దుల్చి బోద నఱకి
తీవ్ర ఝంఝా మహామరుత్ప్రేరకముగ
నావెనుక ధాత్రి పెకలిచి యమ్ముతూఱె.
సుగ్రీవునితో మైత్రీబంధం ఏర్పడిన తరువాత, వాలిని సంహరించి, వానరసామ్రాజ్యానికి అతడిని రాజును చేస్తానన్నాడు రాముడు. అయితే, వాలి బలపరాక్రమాలు తెలిసిన సుగ్రీవుడికి, రాముడి మీద ఇంకా నమ్మకం కుదరలేదు. వాలి ఏ విధంగా ఒక్కొక్క బాణంతో తాటిచెట్టు ఆకులను దులిపివేశాడో చెప్పి, దానికి గుర్తుగా ఏటేటా జరిగే సప్తతాళ మహోత్సవాల గురించి తెలియజేశాడు. రాముడు చిరునవ్వు నవ్వి, సుగ్రీవునితో ఈ విధంగా అన్నాడు.
" సుగ్రీవా ! జీవుని యొక్క సంసార లక్షణం చిత్రంగా ఉంటుంది. వాడొక దుష్కృత్యం చేశాడనుకో. మూలకారణమైన ఆ చెడ్డపనికి వాడి ప్రాణానికి లంకె ఉంటుంది. ఇక ఆ ప్రాణి చేసే మొత్తం పని ఆ దుష్కృత్యంలోనే తెలుస్తూ ఉంటుంది. ద్రష్టలు, లోతుగా విషయ వివేచన చేయగలిగిన మునులకు ఆ మూలహేతువైన పాపం తెలుస్తుంది. "
రాముడు చిరునవ్వు నవ్వుతూ మళ్ళీ ఇలా అన్నాడు.
" ఈ భూమి మీద చాపవిద్యా కౌశల్యానికి దరిద్రం పట్టుకున్నట్లుంది. ఇది విచిత్రం కదా ! వాలి చేసిన సప్తతాళభంజనం చాలా గొప్ప దాని మీరనుకుంటున్నారు. "
అని మాట్లాడుతున్నవాడు మాట్లాడుతూనే, అమ్ములపొదిలో నుంచి ఒక బాణం తీసి, చిత్రవిచిత్ర వేగంతో, చంక్రమణలు చేస్తూ, విభిన్నమైన రీతిలో దూసుకొంటు వెళ్ళేలాగా, బాణాన్ని సంధించాడు.
ఖడ్గవిద్యానిపుణుడు విచిత్రంగా కత్తిని ఝళిపించినట్లు, ఏడు తాడిచెట్ల ఆకుల నన్నిటినీ దులిపి, బోదలను నరికి, తీవ్రమైన గాలి చేత ప్రేరేపింపబడినట్లు, భూమిని పెళ్ళగించి, ఆ బాణం చొచ్చుకుపోయింది.
రాముడు చేసిన అద్భుతమైన ధనుర్విన్యాసాలలో, సప్తతాళభంజన మనేది ఒకటి.
ధనుస్సు యొక్క మధ్య భాగాన్ని లస్తకం అంటారు. ఏ ధనుర్ధారి అయినా, లస్తకం నుండి బాణాన్ని సంధిస్తాడు. కానీ, రామునికి ధనుస్సులోని ఏ భాగమైనా లస్తకమే. కోదండములోని ఏ మూల నుండైనా బాణాన్ని సంధించి, లక్ష్యాన్ని ఛేదించగల, జగత్తులోని ఏకైక ధనుర్ధారి రాముడు. అందువలననే కోదండరాముడనే మాట ఆయన ఎడలనే సార్థకమయింది..
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, నూపుర ఖండము లోనివి.
No comments:
Post a Comment