జర మిది ముగ్ధపత్రక కిసాలయ సూన మనోజ్ఞతా జలా
కరమగు ఋష్యమూక గిరికాననలక్ష్మి శరీరమందునం
బురిపిడికాయనా వెగటు పుట్టఁగజేసెడు చూచుకంటికిన్.
ఎంతటి బ్రహ్మనిష్ఠుఁడొ మహేశ్వరుఁడా ముని యంత భావుకుం
డింత యసహ్యమైనయది యిచ్చట నెట్టుల నోర్వగల్గె నీ
ప్రాంత ధరిత్రి శోభకపవాదిది తా శ్రమణిన్ మదర్థమై
యింతటనుంచిపోయిన మునీశ్వరు ప్రీతియొనర్తు నిచ్చటన్.
సుగ్రీవుడు, తన మంత్రులు , రామలక్ష్మణులతో కలిసి, ప్రభాత సమయంలో, ఋష్యమూక పర్వతం మీదకు వెళ్ళారు. అక్కడ, చెడి పనికి రాకుండా పోయిన చంద్రుని యొక్క పెద్ద కిరణాలు, పాత దూలాలు గుట్టగా పోశారన్నట్లున్న, , కొండంత అస్థిపంజరాన్ని చూశారు. మతంగ మహర్షి ప్రశాంతంగా తపస్సు చేసుకొనే ఋష్యమూక పర్వతం మీద దుర్గంధభూయిష్టమైన అస్థిపంజరం ఉండటానికి కారణ మేమిటని అడిగాడు. అప్పుడు, సుగ్రీవుడు దుందుభి కథను చెప్పటం ఆరంభించాడు. వాలిసుగ్రీవుల వైరానికి, వాలి వధకు, దుందుభి కథ పూర్వరంగం.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము నందలి చిన్న కథలలో దుందుభి కథ కూడా ఒక రసవత్తరమైన కథ.
" మిత్రమా ! అందమైన చిగురుటాకులు, పత్రపుష్పాలు, సరోవరాలతో మనోజ్ఞంగా విలసిల్లే యీ ఋష్యమూక పర్వతము మీద, దున్నపోతు ఆకారంలో, బాగా ఎండిపోయిన అస్థిపంజరం కొండలాగా పడివుండి, సుందరమైన శరీరంలో పురిపిడి కాయలాగా చూడటానికి వెగటు పుట్టిస్తున్నది.
మహేశ్వర స్వరూపుడైన మతంగ మహర్షి ఎంతటి బ్రహ్మనిష్ఠుడో, అంతటి భావుకుడు కూడా. అటువంటివాడు, ఇంత అసహ్యమైన, దుర్గంధాన్ని విరజిమ్ముతున్న, అస్థిపంజరం పడి ఉండటాన్ని ఎలా ఓర్చుకోగల్గుతున్నాడు. ఈ ఋష్యమూక పర్వతప్రాంత శోభకు ఇది అపవాదు కలిగిస్తున్నది. నిందలను భరిస్తూ, నాకు సహాయం చేయటానికి నాతో మైత్రి వహించిన సుగ్రీవుడికి, ఈ పర్వతాన్ని నివాసప్రాంతంగా చేసిన, ఆ మునీశ్వరునికి ప్రీతి కలిగిస్తాను. "
అని శ్రీ రామచంద్రుడు కాలి బొట్టనవ్రేలితో ఆ కళేబరాన్ని ఆకాశంలో విసిరివేశాడు. అది హిమగిరి శిఖరంలా ఎగిరి, దూరంగా ఎక్కడో పడింది. సుగ్రీవుడి మంత్రులు చూసి వచ్చి, అది పది ఆమడల దూరంలో పడిందని చెప్పారు.
ఆ కళేబరం అక్కడ ఉండటం మునిరాజుకు ఇష్టం లేదు కాబట్టే, తాను అక్కడ ఉండగలుతున్నానని సుగ్రీవుడు శ్రీరాముడికి చెప్పాడు.
ఈ వృత్తాతం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, నూపుర ఖండంలో ఉంది.
No comments:
Post a Comment