తన గొంతులోన నూఁగు నినాదముల పూర్వనినదితంబులు వచ్చి నిట్టపొడిచి
తన గుండెలోన డాఁగిన మెత్తనగుచోట్లు భావరూపము లంది పైకి వచ్చి
తన సృష్టిలోన నుండిన క్రొత్త మాధుర్య సీమలు క్రేళ్ళుగాఁ జెంగలించి
తన యాత్మఁ దానెఱుంగని యొక్క యానందపరిధి రేఖా స్వయం వ్యక్తి కలిగి
కనుఁగొలుకులందుఁ గన్నీళ్ళుగార్చి మై గ
గుర్పొడువఁ దనదేహ మా క్రొత్తబిగువు
లెచటదెచ్చొనొ యని కనులింతగను
వచ్చి చూచుచు మునికుఱ్ఱ బిగువు చెడియె.
ఋష్యశృంగుడు విభాండకుని కొడుకు. తండ్రి అతడిని స్త్రీపురుష భేదం తెలియకుండా పెంచాడు. అతడికి అగ్ని, తండ్రి - వీరిద్దరే ప్రపంచం. అడవిని దాటి అత డెప్పుడూ బయటికి పోలేదు. అటువంటి ఋష్యశృంగుడిని అంగదేశానికి తీసుకువస్తే కానీ, అక్కడి దుర్భిక్ష పరిస్థితులు చక్కబడవని పురోహితులు చెప్పారు. ఋష్యశృంగుడిని, అతడి తండ్రి కన్ను గప్పి తీసుకు రావటం కష్టసాధ్యమైన పని. ఈ సంగతి తెలిసి ఋష్యశృంగుడిని తీసుకు రావటానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు, కొందరు వారకాంతలు, దేశక్షేమాన్ని కోరి, ఋష్యశృంగుడిని తీసుకురావటానికి నడుం కట్టారు. వారు అరణ్యంలో ఋష్యశృంగుడు ఉండే చోటికి కొంచెం దూరంలో కుటీరాలు నిర్మించుకొని నృత్య, గాన, వినోదాలతో కాలం గడపసాగారు.
ఇలా ఉండగా, ఒకరోజు తండ్రి అడవిలో చాలా దూరం పోయినప్పుడు, ఋష్యశృంగుడు వారకాంతలు విడిది చేసిన సమీప ప్రాంతానికి వచ్చాడు. అదే సరైన సమయమని భావించి, ఆ వేశ్యలు గొంతెత్తి పాడుతూ, వీణ వాయిస్తూ, నృత్యం చేయసాగారు. అప్పుడు ఋష్యశృంగుని అంతరంగంలో జరిగిన కదలికలను విశ్వనాథ అద్భుతంగా చూపించారు.
" తన గొంతులో ఎన్నో మధురగీతాలు దాక్కొని ఉన్నాయి. ఇప్పుడు వీరి గానాన్ని వినగానే, అవి వెలుపలికి పొడుచుకొని వచ్చాయి. తన హృదయంలో గానానికి, నృత్యానికి స్పందించే ఎన్నో మెత్తనైన చోట్లున్నాయి. వీరి నృత్యాన్ని చూడగానే, అవి భావరూపంలో పైకి వచ్చాయి. తన జీవలక్షణంలో ఎన్నో మధుర సీమలున్నాయి. అవి ఇప్పుడు ఆనందం రూపంలో పైకుబికి, తన ఆత్మను తాకుతున్నాయి. తనలో దాగి ఉన్న సాత్విక భావాలన్ని ఒక్కసారిగా పైకి వచ్చాయి. ఋష్యశృంగుడు భౌతిక పరిధులను దాటి ఒక అలౌకికమైన స్థితి లోనికి వెళ్ళాడు. తెలియకుండానే ఋష్యశృంగుని కనుకొలకుల్లో నీళ్ళు తిరిగాయి. తన దేహంలో యీ క్రొత్త మార్పులెలా వచ్చాయోనని, కళ్ళు ప్రత్తికాయల్లగా చేసుకొని చూస్తున్న, ఆ కుఱ్ఱమౌని అదివరకున్న బిగువు కోల్పోయాడు. "
విశ్వనాథ యొక్క ఋష్యశృంగుడు మనవలె ఈ ప్రపంచానికి చెందినవాడే. అయితే అతని జీవసంపుటిలో ఒక దివ్యమైన సంస్కారం దాగి ఉంది. ఎప్పుడైతే వారకాంతల మధుర గానాన్ని, కనులవిందుచేసే నృత్యాన్ని చూశాడో, అతని లోని ఉత్తమసంస్కారం ఆనందం రూపంలో బయటికి వచ్చి, అతడిని అలౌకికమైన బ్రహ్మానంద స్థితికి తీసుకువెళ్ళింది.
విశ్వనాథవారి ఋష్యశృంగుని పాత్రచిత్రణ దానికదే ఒక మాధుర్య కావ్యం.
No comments:
Post a Comment