సృష్ట్యాదిన్ దితి సంతునన్ మొదటివాఁడే నీవు, మౌర్ఖ్యంబు మీ
సృష్ట్యుద్భూతగుణంబు, కోరి వరియింత్రేలో భవజ్జాతి మృ
త్య్విష్ట్యావేశము పూని వచ్చెదరు మే మేమన్న లాభంబు మీ
ఘృష్ట్యుత్పన్నగుణంబు పండెడిని పోనీ యంచుఁ జాపంబునన్.
సీతను పట్టుకున్న విరాధుడనే రాక్షసుడు, రామలక్ష్మణులకు తన వృత్తాంతాన్ని చెప్పటం ఆరంభించాడు.
విరాధుని తండ్రి పేరు జయుడు. తల్లి శతహ్రద. ఇతడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి, శస్త్రాస్త్రాల చేత చావు లేకుండా, అంతేగాక, తన దేహం వాటిచేత ఖండింపబడకుండ, విడదీయబడకుండ వరాలను పొందాడు.
రామలక్ష్మణులు తండ్రి మాట మీద అడవులకు వచ్చామంటున్నారు కనుక, వారిని చంపననీ, సీతను మాత్రం వదిలిపెట్టననీ చెప్పాడు విరాధుడు. దానితో రామునికి కోపమొచ్చి, నాల్గు కాలాల పాటు వన్యమృగాలను తింటూ బ్రతకాలని ఉంటే, సీతను వదిలిపెట్టి పొమ్మన్నాడు.
" అనిన విరాధుడు నవ్వి, మీరు నన్ను చంపెద మంటిరిగదా ! సీత వదలిన నేటికి జంపెద రన్న, రాముండు కుపితుడై యిట్లనియె. "
" స్రృష్టి ఆరంభంలో దితి సంతానంలో నువ్వే మొదటివాడిలాగా ఉన్నావే ! మూర్ఖత్వమనేది మీ సృష్టిలో నుండి వచ్చిన గుణం. ఏమిటో, మీ జాతివారు, చావును కోరుకొని వస్తారు. చావంటే చాలా ఇష్టమన్నంత ఆవేశంతో వస్తారు. మేమెన్ని చెప్పి ఏం లాభం? మీ ఘర్షణ పడే గుణం పండింది. "
ఈ మాటలంటూ రాముడు తన చాపాన్ని ఎక్కుపెట్టాడు.
విరాధుని మాటలు, అతడు ఎవరికోసమో, దేనికోసమో, ఎదురుచూస్తున్నట్లుగా ఉన్నది. సీతను వదలిపెడితే చంపనన్నారు కాబట్టి, సీతను వదలనన్నాడు. అనగా, విరాధుడు చావు కోసం ఎదురుచూస్తున్నాడు. దైత్యజాతి చావును కోరి తెచ్చుకుంటున్నట్లుగా, శాపగ్రస్తుడై రాక్షసుడిగా మారిన విరాధుడు కూడా, ఆ మృత్యువు కోసమే ఎదురుచూస్తున్నాడు. విరాధుడి మాటలు అతడు కోరుకొంటున్న శాపావసానాన్ని సూచిస్తున్నాయి.
ఈ సన్నివేశం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.
No comments:
Post a Comment