యరయ నితండు మానిసియొ యంతకుమించి యెవండొయౌనొ ని
ర్భరము తపంబు చేసెనొ పురాబహుజన్మములందుఁ జంద్రశే
ఖరుని గుఱించి, యట్లయినఁ గానలు రాఁడు నిరీశ్వరత్వమై.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండము లోని హంసదౌత్యం, విశ్వనాథ కల్పనాచమత్కృతితో పాటు, రావణుని యొక్క మనస్సును విశ్లేషణ చేయటానికి ఉపకరిస్తుంది.
సీతారాముల మధ్య రాయబారం నడిపిన హంసను చూడగానే, ఎంతోకాలం నుండి భక్తుడైన తనను వదలి, శివుడు ఆ బైరాగిని పట్టుకున్నాడేమిటా అని ఆశ్చర్యపోయాడు రావణుడు. మరల, అక్షకుమారుడి కొడుకు చేతిలో హంస బొమ్మను చూడగానే, తనను వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికినట్లయి, శివుడు తనను వీడిపోలేదన్న నమ్మకం కలిగింది. అయితే, సంశయం మాత్రం తీరలేదు. రావణుడు ఈ విధంగా వితర్కించుకోసాగాడు.
" పరమశివుడు, తలలు తరిగి నైవేద్యమిచ్చిన నన్ను వదలి, ఈ బైరాగి కోసం, సీతకు వార్త లందించట మేమిటి? ఈయన అసలు మానవుడా, లేక మానవాతీతుడా? చంద్రశేఖరుడిని గూర్చి పూర్వం పలు జన్మలలో కఠోరమైన తపస్సు చేశాడా? మరి ఆయన అనుగ్రహం పొందితే, అన్నిటినీ కోల్పోయి ఈ విధంగా అడవులకు రాడు కదా !"
రాముని విషయంలో, సంశయ నిస్సంశయాల మధ్య రావణుని మనస్సు తీవ్రమైన ఆందోళనకు గురౌతున్నదని ఈ పద్యం ద్వారా వ్యక్తమౌతున్నది.
No comments:
Post a Comment