సంగరనీతిపద్ధతికిఁ జాలినయోగ్యత లేదుగాని యీ
ముంగిలి నిల్చి దుర్గమును ముట్టడి వేసిన నాకు యుద్ధ నీ
తిం గొని నీకుఁ గార్యపుగతిన్ వచియించుట ధర్మమై చనున్.
ఇప్పుడు వచ్చి నీదుసతి నిచ్చెద నన్ను క్షమింపు మంచునుం
జెప్పిన నేను బోరు విరచించక ముట్టడి నెత్తివేసి పో
నొప్పుదు నంచుఁ జెప్పుటయుఁ నూరక చెప్పుట, నీవు రావు, రా
నప్పుడు రావటం చెఱిఁగి యాడుట యూరక నాల్కయాడుటే.
దైవాధీనము విజయము,
దైవంబన వేఱలేదు ధర్మము న్యాయ్యం
బేవో పూజలఁదనిసెడి
దైవం బొక ధర్మబుద్ధి తాల్పించుటకై.
అంగదుడు వానరసామ్రాజ్యానికి యువరాజు. పినతండ్రి సుగ్రీవుని నెయ్యం కంటే, మేఘవర్ణుడైన శ్రీరామచంద్రునికి భక్తిభావంతో ఎక్కువగా వశుడైనవాడు. అటువంటి అంగదుడిని రావణుడి వద్దకు రాయబారిగా సుగ్రీవుడు పంపాడు. రావణుడు మంత్రులతో కొలువున్న సమయంలో, అంగదుడు అక్కడకు వెళ్ళాడు. తాను రాముని దూత అంగదుడిననీ, శ్రీరాముడు పంపగా వచ్చాననీ చెప్పాడు.
అంగదుడు శ్రీరాముడి మాటలను యధాతథంగా ఇలా చెప్పాడు.
" దొంగతనంగా నా భార్యను ఇక్కడకు తెచ్చిన నీకు నిజానికి యుద్ధనీతి పద్ధతిని పాటించే యోగ్యత లేదు. అయినప్పటికీ, లంకకు సైన్యంతో వచ్చి, నీ దుర్గాన్ని ముట్టడి చేసిన నేను, యుద్ధనీతి ననుసరించి, నీకు ఉచితమార్గాన్ని చెప్పటం, ధర్మమని భావించి చెబుతున్నాను.
నిన్ను వధించి, నీ తమ్ముడు విభీషణుడిని దైత్యసామ్రాజ్యానికి రాజును చేస్తున్నందుకు నీ ప్రేతాత్మ దుఃఖించకుండా, నేను చెప్పే మాటలు శ్రద్ధగా విను. నేను చెప్పినట్లుగా, దానవసామ్రాజ్యలక్ష్మి ధర్మాభిరతుడైన విభీషణుడి చేతిలో క్షేమంగా ఉంటుంది.
నీ వంటి దుర్జనశేఖరుడు మంచి మాటనేది వినడు. అట్లా అయినా కూడా, సపుత్రబాంధవంగా నిన్ను వధించకుండా, నేను నీతో రాయబారం జరుపుతున్నానంటే, మర్యాదామార్గంలో, తప్పు సరిదిద్దుకొన్నవాడిని రక్షించటం ధర్మం కనుక, ఆ విధంగా చేశాను.
ఇప్పుడు నువ్వు వచ్చి, నా భార్యను అప్పగిస్తున్నానని, క్షమించమని అడగటం, నేనేమో యుద్ధాన్ని విరమించి వెనక్కి తిరిగి వెళ్ళిపోతానని చెప్పటం, ఏదో మాటవరసకు ఊరకే చెప్పటం తప్పితే, నీ మూర్ఖత్వానికి, నీ కున్న గర్వానికి నువ్వట్లా రానే రావని నాకు తెలుసు. నువ్వు రానప్పుడు, రావని తెలిసి కూడా, నేను మాట్లాడటం, ఊరకే నాలుక ఆడించటం తప్పితే ఇంకొకటి కాదు.
ఇంకొక విషయం. యుద్ధంలో గెలుపనేది దైవాధీనం. దైవమంటే ఎక్కడో వేరుగా లేదు. ధర్మం, న్యాయం అనేవే దైవమంటే. ఇక మనం చేసే పూజలను దైవం స్వీకరించటం
ధర్మబుద్ధి కలిగించటానికే. "
ఈ అంగద రాయబారం, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండము లోనిది.
No comments:
Post a Comment