కూడి మును హనుమ కూర్చున్న చోటనే
కోరి హంస వచ్చి కూరుచుండె
హంసఁ గాంచినంత నవనీజ గుండెలో
నమృతకుల్య యుబ్బినట్లు తోఁచె.
మానసమందు లజ్జవడి క్ష్మాసుతచూచెను హంస దిక్కునన్
జానకిలో నదొక్క నిముసంబున గాఢ సమాధి పొల్చినన్
దానల యీశ్వరేశ్వరియుఁ దాను సనాతని యంచుఁ దోచినన్
జానకిదేవి క్రీఁబెదవి చాయలఁ జిర్నగ వంకురించినన్.
ఆ చిఱునవ్వు నవ్వనినయట్టులు లే దతిలోక మోహ
నంబై చెలువారు మోహనత యన్నదలౌకికమై సురారి దృ
గ్రోచులు మందగించినవి, గుండియ యాగినయట్టులై త్రియా
మా చర సార్వభౌమునకు మానసమంతయుఁ గోపమై చనెన్.
రావణుని సేనానులలో విద్యున్మాలి అని ఒక మహా మాయావి ఉన్నాడు. అతడు కల్పించిన, రక్తంతో తడిసిన రామలక్ష్మణుల మాయాశిరస్సులను, ధనుర్బాణాలను రావణుడు సీతకు చూపించాడు. దుఃఖిస్తున్న సీతకు ఇంతలో చెట్టుపైన రాజహంస కనిపించింది. రాజహంస లంకలోని అశోకవనంలో ఒక చెట్టుకొమ్మ పైన, సీతాన్వేషణకు వచ్చినప్పుడు హనుమ ఎక్కడ కూర్చున్నాడో సరిగా అక్కడే కూర్చున్నది. రాజహంసను చూడగానే సీత హృదయంలో అమృతపు మడుగు ఉబికినట్లయింది.
హంస, రామలక్ష్మణులు సమస్త వానరసైన్యంతో లంకకు చేరిన సంగతిని, రాముని చేతిలో రావణునితో పాటు రాక్షస సంహారం తథ్యమని చెప్పి ఊరట కలిగించింది. కొంతసేపటికి, విద్యున్మాలికృత మాయాశిరస్సులు, ధనుర్బాణాలు మాయమయ్యాయి. రావణుడు వికవికా నవ్వి ప్రేలుతూనే ఉన్నాడు. రావణునికి, హంస రాముని వద్ద నుండి సందేశాన్ని మోసుకు వచ్చిందని అర్థమయింది. కపటి అయిన రావణుడు తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. సీత మూర్ఛపోయినప్పుడు ఆమెకు రాముని మీద కొంత ప్రేమ ఉందేమోనని అనుకున్నాడని, కానీ ఇప్పుడు మూర్ఛ నుండి తేరుకొనడం వల్ల, మిగిలి ఉన్న భోగవాంఛలను తీర్చుకోవాలన్న ఆమె అంతర్గత భావం అర్థమయిందనీ, యుద్ధంలో రాముడిని చంపి, ఆ భోగవాంఛలకు పరిపూర్ణత కలిగిస్తానని, ప్రేలాపలనాడాడు రావణుడు.
ఈ ప్రేలాపనలకు మనసులో సిగ్గుపడి, సీత హంస కూర్చున్న వైపు చూసింది. ఆ చూసిన ఒక్క క్షణంలో తాను సమాధి స్థితిలోకి వెళ్ళినట్లనిపించి, అందులో తాను పరమేశ్వరి అనీ, సనాతని అని అనిపించింది. ఈ భావం రాగానే, ఆమె క్రింది పెదవి మీద చిరునవ్వు అంకురించింది.
ఆ చిరునవ్వు, నవ్వులాగా లేదు. అది అతిలోకసుందరంగా ఉంది. ఆ సౌందర్యం అలౌకికమై, రావణుని దృష్టిని హరించివేసింది. ఒక్కసారి ఆ రాక్షస సార్వభౌముడి గుండె ఆగినట్లయి, అది కోపంగా మారింది. "
రాజహంస రూపంలో వచ్చిన పరమేశ్వరుని దర్శనం కాగానే, సీతకు సమాధి స్థితి కలిగింది. అందులో, ఆమె సాక్షాత్తు పరమేశ్వరి అని, దేశకాలాతీతురాలని అనిపించింది. శ్రీమహాలక్ష్మి, మహాసరస్వతి, మహేశ్వరి రూపాలు పరమేశ్వరి యొక్క స్వరూపమే. ఆ భావం కలుగగానే, ఆమె ఇప్పటి స్థితి తళుక్కున స్మృతిపథంలో మెరిసి, ఆమె చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వు వెనుక రావణునికి అర్థం కాని నిగూఢవ్యూహం దాగున్నదా?
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండము లోనివి.
No comments:
Post a Comment