పూర్ణమ్ము లేకుండఁ బునుకులుగా వేసితిమి కరకరలాడు తినుఁడు వీని
గాలుచు నున్నది కాఁబోలు క్షీరాన్న మిదె దొన్నెలను దెచ్చియిత్తు నుండుఁ
డిది గడ్డపెరుఁగు మీరింకఁ గొంచెము వేసి కొనవలెఁ జలువ చేయును గదండి
యనుచు బతిమాలి బతిమాలి యవనినాథ
సూదకులు కొల్లలుగఁదెచ్చి చూఱయీయ
నన్నమును నాదరంబునఁ దిన్న కడుపు
లెన్న నెఁడదలు నుబ్బిపోయెదరు జనులు.
అన్నంపురాసులు చిన్న తోమాలెలకై సన్నజాజులు పోసినట్లు
సన్నఖర్జూరపుఁ జాపలపై సూపరాసులు గంధమ్ము తీసినట్లు
ఎఱ్ఱవాగుగను వేయించి నప్పడములు పునుఁగు కుంకుమ కుప్పవోసినట్లు
వంగపండుల పేళ్ళ వరుగు చోష్యపు గుబాళింపు లత్తరులు నొల్కించినట్లు
రాఘవుల యిలవేల్పు శ్రీ రంగనాథ
ప్రభువు పవళింపు సేవకై భద్రపఱచి
నట్టి సంభార మనఁగ మహాసనంబు
ద్రవ్యములు పొల్చె దశరథక్రతువు వేళ.
దశరథ మహారాజు పుత్రసంతానం కోసం అశ్వమేధ యాగ సన్నాహాలు చేస్తున్నాడు. బంధువులకు, మిత్రులకు, ఋషిసంఘాలకు, అతిథులకు ఆహ్వానాలు పంపించాడు. వారి విడిది దగ్గర నుంచి, యాగం చూడటానికి వచ్చేవారి కోసం భోజనాల ఏర్పాట్లు చేశాడు. ఇక అయోధ్యావాసుల సంగతి సరేసరి. వారంతా యజ్ఞశాల దగ్గరే కొలువుతీరి ఉన్నారు.
శ్రీమద్రామాయణ కల్పవృక్షం, బాల కాండము, ఇష్టి ఖండము లోని యీ రెండు సీసపద్యాలలో, తెలుగువారి ఇండ్లలో జరిగినట్లుగా, దశరథ మహారాజు చేసిన ఏర్పాట్ల నన్నిటినీ వర్ణించారు. యజ్ఞం చూడటానికి వచ్చిన అతిథులు, పురజనులకు వంటవాళ్ళు కొసరి వడ్డించటం, వారి అతిథి మర్యాదకు అద్దం పడుతుంది.
" ఇప్పుడే గుండిగ దించి, ఇగురబెట్టాము. అన్నం పొడిపొడిలాడుతూ ఉంది. ఈ అన్నం పెట్టించుకోండి. పూర్ణాలు మాదిరిగా కాకుండా, కరకరలాడేటట్లు పునుగులుగా వేశాము. ఇవి తినండి. అయ్యో ! పాయసం బాగా వేడిగా ఉన్నట్లుంది, ఉండండి దొన్నెలను తెస్తున్నాం. గడ్డపెరగండి బాబూ ! చలువ జేస్తుంది కొంచెం వేసుకోండి. అని ఈ విధంగా అంటూ, దశరథ మహారాజు సేవకులు కొసరి కొసరి వడ్డించారు. భోజనం చేసిన జనాల హృదయాలు సంతోషంతో ఉబ్బిపోయాయి. "
ఇక విశ్వనాథ, వంటలను వర్ణించిన తీరులో, తెలుగుదనం ఉట్టిపడుతున్నది.
" తోమాలెలలో (అన్నం వడ్డించే గిన్నెలు) నింపిన అన్నం సన్నజాజులు పోసినట్లుగా ఉంది. రాసులుగా ఖర్జూరపు చాపలపై పోసిన పప్పు, గంధం తీసినట్లుగా ఉంది. దోర ఎరుపు రంగులో వేయించిన అప్పడాలు, పునుగు కుంకుమ కుప్పపోసినట్లుగా ఉంది. పండిన వంకాయల వరుగుతో చేసిన చోష్యం అత్తరుల వాసన గుబాళిస్తున్నది. ఈ విధంగా వండిన పదార్థాలు, రఘువంశ రాజుల ఇలవేల్పు రంగనాథస్వామి పవళింపు సేవ కోసం సమకూర్చిన సంభారాల లాగా దశరథ మహారాజు వంటశాల కనిపించింది. "
ఈ రెండు సీసపద్యాలలో విశ్వనాథ ఒక ప్రక్కన దశరథుని అతిథి మర్యాదలను వర్ణిస్తూనే, తెలుగువారి వంటలను కూడా రుచి చూపించారు.
ఈ రెండు సీసపద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, ఇష్టి ఖండము లోనివి.
No comments:
Post a Comment