ఐహికమున్ విరక్తిఁగొని యాత్మపదార్థ పరార్థనైచికీ
దోహనశీలమౌ నెడదఁ దూఁగినతూఁకువ నీవు క్రొత్త రూ
పై హవణించుటో ! హృదయమందిన మేలిమి యైన తేకువో !
ఓ హర ! రెంట భేదమని యొప్పని నీదు అనుగ్రహంబొకో !
" ఓ హర ! నాకు ఇహలోక వాంఛల మీద విరక్తి కలిగింది. పరలోకం మీదకు మనస్సు పోతున్నది. పరలోకమనేది సమృద్ధిగా పాల నిచ్చే పాడియావు వంటిది. ఈ పరార్థ చింతన, పరమానందదాయకమైన ఆత్మపదార్థజ్ఞానానికి హృదయం మొగ్గుచూపుతున్నందువల్లనో, లేక నా హృదయంలో వచ్చిన స్వచ్ఛత యొక్క తూకంవల్లనో, ఈ రెండూ కాకపోతే, యీ రెండింటికి భేదం చూపని నీఅనుగ్రహంవల్లనో, నాకు తెలియటం లేదు. "
ఇహలోక విషయాలు అశాశ్వతమైనవి. ఆముష్మిక సుఖం ఆనందదాయకం. అందువల్ల, స్వస్వరూప సంధానం కలగాలంటే, ఐహికం మీద విరక్తి కలగాలి, హృదయంలో పవిత్రత, స్వచ్ఛత రావాలి. ఈ రెండూ కాకపోతే, భగవదనుగ్రహమన్నా ఉండాలి.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, అహల్యా ఖండము లోని చివరి పద్యం.
No comments:
Post a Comment