ఋషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి తిక్కన శిల్పపుఁ దెనుఁగుతోఁట
యెఱ్ఱన్న సర్వమార్గేచ్ఛావిధాతృండు పోతన్న తెలుఁగుల పుణ్యపేటి
శ్రీనాథుఁడు రసప్రసిద్ధ ధారాధుని కృష్ణరాయఁ డనన్యకృతిప్రబంధ
పెద్దన వడపోత పెట్టు నిక్షురసంబు రామకృష్ణుఁడు సురారామగజము
ఒకడు నాచన సోమన్న యుక్కివుండు
చెఱిపి పదిసార్లు తిరుగ వ్రాసినను మొక్క
వోని యీ యాంధ్ర కవిలోక మూర్థమణుల
మద్గురుస్థానములుగ నమస్కరించి.
శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారికలో విశ్వనాథ, పద్యకవితారచనను చేసిన కొందరు ప్రాచీనాంధ్ర మహాకవులను తనకు గురువులుగా భావిస్తూ, ఆ మహాకవుల కవిత్వంలో ఉన్న విశిష్టతను భావితరాలకు చాటిచెప్పారు.
" సంస్కృతంలో ఆదికవి, రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి. తెలుగులో ఆదికవి నన్నయ్య. ఆయనది ఋషి వాక్కు. అందుచేత, నన్నయ్య రెండవ వాల్మీకి. తిక్కన ఉభయభాషా ప్రౌఢ శిల్పపారగుడు. ఆయన జాను తెనుగు పదాలతో పదిహేను పర్వాల ఆంధ్రమహాభారతమనే తోటను ఫలవంతం చేశాడు. కవిత్రయంలో చివరివాడైన ఎఱ్ఱన్న, అటు కావ్యమార్గాన్ని అనుసరిస్తూ, ఇటు ప్రబంధము మార్గానికి బాటలు వేశాడు. ఎఱ్ఱన కవిత్వంలో స్వతంత్రమార్గాన్ని పాటించిన మహాకవి. పోతన తెలుగువారి పుణ్యముల పెన్నిధి. శ్రీనాథుడు రసమును ప్రధానంగా ప్రవహింపజేసిన చేసిన ఒక జీవనదిలాంటివాడు. సాహితీసమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు " ఆముక్తమాల్యద " అనే అనన్యమైన ప్రబంథాన్ని తెలుగువారికి అందించినవాడు. ' స్వారోచిష మనుసంభవము ' అనే మహాప్రబంథాన్ని, వడపోసిన చెఱుకు రసంలాగా అందించినవాడు ఆంధ్రకవితా పితామహుడు అల్లసాని పెద్దన. ప్రాచీనాంధ్ర పంచమహాకావ్యాలలో ఒకటిగా పేరెన్నిక గన్న ' పాండురంగ మాహాత్మ్యము ' అనే కావ్యాన్ని రచించిన తెనాలి రామకృష్ణుడు అమరలోకపు ఐరావత గజము వంటివాడు. నూతనగుణసనాథుడు, ' ఊత్తరహరివంశ ' కర్త అయిన నాచన సోమన, ఆయనకు ఆయనే సాటి. అనగా ఆయన శుక్రగ్రహంలాగా మహాప్రకాశవంతమైనవాడు. ఈ మహాకవుల కవితాప్రాగల్భ్యం ఎంత చెరిపి వేద్దామనుకున్నా చెరిగి పోయేది కాదు. అటువంటి మహాకవులను గురువులుగా భావించి విశ్వనాథ, వారికి అంజలి ఘటించారు. "
విశ్వనాథ చేసిన కవిత్వతత్త్వవిచారణ, ఈ మహాకవుల కవిత్వాన్ని విశ్లేషణాత్మకంగా అనుశీలన చేయటానికి భావితరాల విమర్శకులకు ఉపయుక్తమౌతుందనేది నిర్వివాదంశం.
No comments:
Post a Comment