ఒక దాయాదియె నిప్పుతో సమము, పైనూహించుమా ! నీ కుమా
రకుఁ డాసన్నతగల్గు వారసుడు, నా రాముం డసృక్సర్వబిం
దుకవైశ్వానరుఁ డింకఁ దోడుకలఁడా తోడుగ్రధన్వుండు పా
యక సౌమిత్రి తదీదృశంబులు త్వదూహప్రాంతభద్రంబులున్.
మంథర కైక మనస్సు మార్చటానికి సర్వ శక్తులూ ఒడ్డుతున్నది. మంథర మోసుకువచ్చిన అభిషేక వార్తను, శ్రీరాముడు పట్టాభిషేకానికి ఒప్పుకున్నాడన్నట్లుగా అర్థం చేసుకొన్న కైక, శుభవార్త చెప్పిందన్న సంతోషంతో, తన మెడలో నున్న హారాన్ని తీసి బహుమానంగా ఇవ్వబోయింది. . భయకోపాలతో ఒళ్ళుతెలియని మంథర , " అయ్యో అయ్యో " అంటూ ఏడుస్తూ, కైక చేతిలో నుండి హారాన్ని లాక్కొని దూరంగా విసరివేసింది. " ఏడవ వలసిన సమయంలో నవ్వుతున్న దానిని కైకను ఒక్కత్తెనే చూశానని, సవతి శత్రువైతే, సవతి కొడుకు శత్రువు కాకుండా పోతాడా అని, ఇక రాముడు సింహాసనం మీద నిలువద్రొక్కుకుంటే ఇంకేమన్నా చేయగలమా అని, ఎన్నో విధాలుగా, మనసులో నాటుకొనేటట్లుగా చెప్పింది మంథర. ఇంకా మంథర ఇలా అంటున్నది.
" ఒక దాయాది ఉంటేనే నిప్పుతో సమానం. ఇప్పుడు ఇద్దరున్నారు. ఇక నువ్వే ఆలోచించుకో. నీ కొడుకంటే నీ వారసుడు, నీ కనుసన్నల్లో ఉంటాడు. మరి రాముడు? ఒంట్లో ప్రతి రక్తపు చుక్కను ఆవిరిచేయగల అగ్ని వంటివాడు. ఇక ఆయనకు తోడొకడున్నాడు. ఉగ్రస్వరూపుడు లక్ష్మణుడు. ఆ దృశ్యాలు, ఊహలు తలచుకుంటేనే అభద్రతా భావం పుడుతుంది. "
మంథర, పుట్టినింటినుంచి అరణంగా తెచ్చుకొన్న దాది. తల్లిలేని పిల్ల, కైకను పెంచి పెద్ద చేసింది. ఆ భావం కైకలో బలంగా నాటుకొని ఉంది. అది మంథరకు కూడా తెలుసు. దానిని ఆసరాగా చేసుకొని, మంథర కైక మనస్సు రాముని నుండి విముఖం చేయటానికి సర్వవిధాలుగా ప్రయత్నం చేస్తున్నది.
ఈ సన్నివేశం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండములో ఉంది.
No comments:
Post a Comment