క్రతుయత్న మెంతదూరము వచ్చెనో చూడ వెల్లేన్గు వజ్రి పంపించెనొక్కొ
యజ్ఞాగతునకు నారాయణునకు మున్గదలి పాంచజన్యంబు తరలెనొక్కొ
యాగఫలంబైన యమృతకుంభము మింటఁ దెరలి ప్రాగ్దిశ బయల్దేరెనొక్కొ
మైత్రావరుణి ప్రేమమంజులాశీర్వాద వల్లిక తలపూవు వదలెనొక్కొ
యష్టతనువుల హోత్రి యైనట్టి తనువు
తోడి రుద్రసంరంభవిధూతి చెదరి
ముందునకుఁ దూఁగెనో యన నిందుబింబ
మల్లఁబ్రాచి బారెఁడు పైనిహౌసులొలికె.
దశరథుని అశ్వమేధ యాగానికి సన్నాహాలు చేస్తున్నారు. యాగం చేయవలసిన స్థల నిర్ణయం జరిగింది. యజ్ఞశాలను నిర్మించారు. అతిథులు ఉండటానికి గృహాలు, భోజన వసతులు, అన్ని వర్ణాల వారికీ కల్పించారు. ఇక్కడ విశ్వనాథ అందమైన సీసంలో ఒక అద్భుతమైన కల్పన చేశారు. అదేమిటంటే, శ్రీమహావిష్ణువు రామునిగా జన్మించి రావణ సంహారం చేస్తానని మాట ఇచ్చాడు కదా ! అందుకని, యాగం ఎప్పుడు జరుగుతుందా, ఎప్పుడు రాముడు పుడతాడా అని దేవతలందరూ ఎదురు చూస్తున్నారు. ఆకాశంలో విహరించే చంద్రుడికి కూడా ఎంతో ఉబలాటంగా ఉంది. యాగం పనులు ఎంత వరకు వచ్చాయో చూద్దామని వచ్చాడా అన్నట్లు, పూర్ణచంద్రుడు ఆకాశంలో అందాలొలికించాడట.
" దశరథుని యాగం పనులు ఎంత వరకు వచ్చాయో కనుక్కోవటానికి ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని పంపించాడా అన్నట్లు, యజ్ఞాగతుడైన శ్రీమన్నారాయణుని కంటే ముందే అతని శంఖం పాంచజన్యం కదలివచ్చిందా అన్నట్లు, యజ్ఞఫలమైన అమృతకలశం ఆకాశంలో తూర్పు దిక్కున బయలుదేరిందా అన్నట్లు, మైత్రావరుణి (అగస్త్యుడు) ప్రేమతో తన చల్లని ఆశీర్వాదచిహ్నంగా, తల మీద పువ్వును వదలాడా అన్నట్లు, శివుని అష్టతనువులలో ఒక తనువైన ఋత్విక్కు రుద్రసంరంభంతో (ప్రమథగణాలతో) చెదిరిపోయి కదిలి ముందుకు దూకాడా అన్నట్లు, చంద్రబింబం తూర్పుదిక్కున బారెడు పైన ఒయ్యారాలు ఒలికించాడు. "
ఐరావతం, పాంచజన్యం, అమృతకుంభం మొదలైనవి తెల్లనైనవి, తెల్లని పాలసముద్రం చిలికినప్పుడు ఉద్భవించినవి.
శ్రీమద్రామాయణ కల్పవృక్షములో చంద్రవర్ణనాన్ని ప్రధాన కథకు అనుసంధానం చేసి విశ్వనాథ సందర్భోచితంగా పలు తావుల్లో ఉపయోగించుకున్నారు. ఉదాహరణకు, క్రతుయత్నాన్ని చూడటానికి వచ్చినట్లు చేసిన వర్ణన వలె, దాశరథుల జననాన్ని, శైశవాన్ని చూడటానికి వచ్చాడా అన్నట్లు కూడా విశ్వనాథ, తన కల్పనాచమత్కృతిని జోడించి వర్ణనలు చేశారు.
ఈ వర్ణన శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, ఇష్టి ఖండములో ఉంది.
No comments:
Post a Comment