నెన్నన్ భావిని జత్తు రేమయిన గానీ ! స్వామి ! నిన్ గౌఁగిలిం
ప న్నేనైతిని దుంబురుండనఁగ నే వర్తింతు గంధర్వుఁడన్
నన్నున్ ఎరుంగరొ వైశ్రవణుండు తిట్టినదిగా నర్తించితిన్ దైత్యుడై.
అంపంగాఁ బినతల్లి స్వామియు వనీయాత్రాగతిన్ వచ్చి నిన్
జంపున్ నీ సహజంపురూపము గడించంజాలు దంచుం బ్రసా
దింపన్ నీకయి వేచియుంటిఁ బ్రభువా ! దీవ్యద్భుజా శ్రీధను
శ్శంపానీరదమూర్తి ! నిన్ను గుఱుతింపంజాల కెట్లయ్యెడున్.
నీ మార్గణం బపూతపు
నామేనునఁ బడకమున్న నాథా ! వైదే
హీ మహిత తనూస్పర్శ
వ్యామిశ్రముగాఁగఁ బూతపఱచితిఁ దండ్రీ !
విరాధుడు శస్త్రాస్త్రాల చేత చంపబడనట్లుగా, వానిచేత ఖండింపబడనట్లుగా, విడదీయబడకుండునట్లుగా బ్రహ్మదేవుని వద్ద నుండి వరాలు పొందాడు. ఆ వరప్రభావంతో, రామలక్ష్మణులు బాణప్రయోగం చేసినా వాడు చావలేదు. వాడు, వారిద్దరిని చెరొక బుజాన వేసుకొని పరుగెత్తసాగాడు. రామలక్ష్మణు లిద్దరూ విరాధుడి మెడ మీద అటూఇటూ కాళ్ళు వేసి కూర్చొని, ఆ రాక్షసుడి రెండు బుజాలను కత్తితో నరికారు. విరాధుడు బాధతో పెద్దగా అరచి క్రిందబడ్డాడు. రామలక్ష్మణులు లాఘవంగా క్రిందకు దూకి, వాడు లేవకుండా మీద కూర్చొని, వాడి శరీరమంతా బాణాలతో తూట్లుతూట్లుగా పొడిచారు. విరాధుడి దేహమంతా నెత్తురుముద్దయింది కానీ, వాడు మాత్రం చావలేదు.
రాముని కప్పుడు బ్రహ్మ వరాలు గుర్తుకొచ్చి, వాడి గొంతును ఊపిరాడకుండా గట్టిగా నొక్కి పట్టుకొని, వాడిని పూడ్చటానికి, లక్ష్మణుడిని ఒక గొయ్యిని త్రవ్వమన్నాడు. ఈ మాటలు వినగానే విరాధుడు " శ్రీరామా ! మంచియూహ చేసితివయ్యా ! " అని మెచ్చుకొన్నాడు. విరాధుడు రామునితో ఇంకా ఇలా అన్నాడు.
" పద్మనేత్రా ! రామా ! ఇప్పటికే నీ చేతిలో ఎందరో రాక్షసులు చచ్చిపోయారు. రాబోయే కాలంలో ఏది ఏమైనా కానీ, ఇంకెంతోమంది చచ్చిపోతారు. నా పూర్వజన్మపుణ్యం వల్ల నిన్ను కౌగలించుకోగలిగాను. స్వామీ ! నేను తుంబురుడనే గంధర్వుడిని. కుబేరుని శాపంతో రాక్షసజన్మ నెత్తాను.
ఆజానుబాహుడా ! నీలమేఘవర్ణా ! కోదండరామా ! నిన్ను గుర్తుపట్టకుండా ఎలా ఉండగలను? పినతల్లి కోరిక మీద, వనవాసానికి వచ్చిన నువ్వు నన్ను చంపుతావని, ఆ విధంగా నాకు సహజ రూపం వస్తుందని, కుబేరుడు చెప్పినందువల్ల, నీ కోసం కళ్ళు కాయలుకాసేటట్లు ఎదురుచూస్తున్నాను.
నీవు ప్రయోగించిన బాణాలు నా రాక్షసదేహాన్ని తాకి అపవిత్రం కాకుండా, తల్లి వైదేహి తనుస్పర్శతో నా దేహాన్ని పునీతం చేసుకొన్నాను తండ్రీ ! "
మీరు రామలక్ష్మణులమని చెప్పేటంతవరకు, నేను ఎంతో మథన పడ్డాను. మీరు మీరని తెలిసిన తరువాత ప్రాణాలు కుదుట పడ్డాయి. అందుకనే, నేను ఎంత ఒదిగి మాట్లాడానో చూశారు కదా ! "
గంధర్వుని జీవలక్షణము, దైత్యుని దేహభావము కలగలిసిన విరాధుని పాత్రను, విశ్వనాథ మలచిన తీరు అనన్య సామాన్యమైనది. ఈ సన్నివేశం, శ్రీమద్రాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనిది.
No comments:
Post a Comment