ఓసీ ! యోసి ! యిదేమి దుఃఖమె విచిత్రోదంత వాచాల ! స
ర్వాసుప్రాంగణముగ్ధదీపిక కదే యా బిడ్డ శ్రీరాముఁడా
శాసంపాదకుఁ డెల్ల జీవులకుఁ దీక్షాధర్మపారంపరీ
వ్యాసంగుం డతఁ డొండు రాజయిన నెగ్గా? నీకునున్ నాకునున్.
మాండవి కన్న జానకియె మన్ననసేయును నన్ను బిడ్డ రా
ముండును దల్లికంటె ననుఁ బూజలుపట్టును, దానిమాట య
ట్లుండఁగనిమ్ము, రాముఁడొకయోగి మఱిన్ దితిజోగ్రవారి మా
ర్తాండుఁడు దానికై తనువుఁదాల్చె రహస్యముసుమ్ము మంథరా !
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండములోని ఈ పద్యాలు, విశ్వనాథ, వాల్మీకి హృదయానుబంధిగా, కైక పాత్రను ఎంత మహోదాత్తంగా తీర్చిదిద్దారో అర్థమౌతుంది.
తన ప్రాణానికి ప్రాణమైన రాముడు పట్టాభిషేకం చేసుకొనడానికి అంగీకరించాడన్న వార్త విని ఆనందించిన కైక, మెడలోని హారాన్ని తీసి, మంథరకు బహుమానంగా ఇవ్వబోయింది. నివ్వెరబోయిన మంథర, దానిని కైక చేతుల నుండి లాక్కొని దూరంగా విసరివేసి, బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టింది. అట్లా ఏడుస్తున్న మంథర మీద కొంత ప్రసన్నత వహించిన కైక ఇలా అన్నది.
" ఓసి మంథరా ! ఇదేం దుఃఖమే? నువ్వు చెప్పేదంతా విచిత్రంగాను, నోటి దురుసుతనంగాను ఉందే ! సర్వ జీవుల ప్రాణాలనే ముంగిలిలో వెలుగొందే దివ్యజ్యోతి కదే శ్రీరాముడు ! సర్వ జీవుల ఆశలను తీర్చేవాడు కదే ! ధర్మ పరంపరను దీక్షగా కొనసాగించేవాడు కదే ! అటువంటివాడు రాజైతే నీకు కష్ట మేమిటి, నాకు నష్ట మేమిటి?
ఇంకొక విషయం తెలుసా నీకు? నా కోడలు మాండవి కన్న ఎక్కువగా సీత నాకు మర్యాద ఇస్తుంది. ఇక బిడ్డ రాముడు సరేసరి. తల్లి కంటె ఎక్కువగా నాకు సపర్యలు చేస్తాడు. దాని మాటకేం గానీ, అదట్లా ఉండనీ. రాముడు ఒక యోగి. దైత్యులనే మహాసముద్రాన్ని ఇంకింపజేసే సూర్యుడు. అసలు దాని కోసమే అవతారమెత్తాడు మంథరా ! ఇది రహస్యం సుమా ! "
ఈ పద్యాలు చదువుతుంటే, కైకేయి పాత్ర యెడల జనబాహుళ్యంలో ఉన్న అపవాదు మంచులా కరిగిపోయి, ఆమె ఉదాత్త భావాలతో హృదయం ప్రక్షాళనమై, కరుణరసం పొంగులువారుతుంది.
ఓ విశ్వనాథ ఋషీ ! తెలుగునేలకు రామాయణమనే స్వర్లోక కల్పవృక్షాన్ని తీసుకువచ్చావు. ఈ జాతి నీకెంతో ఋణపడి ఉంది.
No comments:
Post a Comment