యే ఋషికథ చెప్పుచున్న నేమి యగస్త్యో
దార చరిత్రస్పర్శ వి
నా రాదది రామునకు మనంబున నాడున్.
కనులను మూసి యోగపరికల్పిత గాఢ సమాధి లగ్నులా
త్మను దనియింత్రు లోకపరితర్పణ సంగత వీరకర్ములౌ
మునులు కనుల్ చెవుల్ మనసు బుద్ధి యివెల్లను సంతసింపఁజే
యనగుదు రింద్రియంబులకు నంటి చరించునుగాదె జీవులున్.
సీతారామలక్ష్మణులు పదేండ్లు అరణ్యవాసాన్ని పూర్తిచేసారు. ఈ పదేండ్ల కాలంలో, మునులను రాక్షసుల బారి నుండి రక్షిస్తూ వచ్చారు. వారితో ప్రసంగిస్తూ, వారు చెప్పే పురాణ కథలను వింటూ పులకించిపోయారు. ఋషులు చెప్పే కథలు, ఋషుల యొక్క కథలు యెన్నో విన్నారు. ఏన్ని కథలు విన్నా, రాముడికి, అగస్త్యమహర్షి యొక్క మహత్తరమైన చరిత్ర వినకుండా, మనస్సుకి ఆనందం కలగటం లేదు. రాముడి మనస్సులో యెప్పుడూ అగస్త్యమహర్షి కదులుతుంటాడు.
ఒకరోజు రామచంద్రుడు, " నేను మున్యాశ్రమాలు తిరుగుతున్నప్పుడు, ఎక్కడికి వెళ్ళినా అగస్త్య మహర్షి లోకకళ్యాణార్థం చేస్తున్న పనులను గురించి చెప్పేవాళ్ళు. నే నింతకుముందు వెళ్ళిన ఆశ్రమాలకు అగస్త్యమహర్షి ఆశ్రమం చాలా దూర మంటున్నారు. ఇక్కడకు అది యెంత దూరమో చెప్పండి. " అని సుతీక్ష్ణుడిని వినయంగా అడిగాడు. ఆ సందర్భంలో, మునుల యొక్క యోగనిష్ఠను గురించి ఎంతో కొనియాడాడు.
" మునులు కళ్ళు మూసుకొని ధ్యానముద్రలో కూర్చొని, గాఢమైన యోగ సమాధిలో మునిగిపోయి, తమ ఆత్మలలో రమిస్తూ ఉంటారు. జగత్కళ్యాణం కోసం ఇదంతా చేస్తున్న ఈ వీరకర్ములు, దానిలోనే తృప్తి పొందుతూ ఉంటారు. ఇక సంసారజీవులు, కళ్ళు, చేతులు, మనస్సు, బుద్ధి, వీటినన్నిటినీ సంతోషపెడుతూ, యింద్రియాలను అంటిపెట్టుకొని తిరుగుతూ ఉంటారు. "
రామయాణంలో చాలా చోట్ల, రాముని యొక్క వైరాగ్య భావన తళుక్కుమంటూ కనిపిస్తూ ఉంటుంది. శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో, విశ్వనాథ చేతిలో రాముని యొక్క నిర్వేదం బహుముఖాలుగా ప్రస్ఫుటమయింది.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనిది.
No comments:
Post a Comment