నీ చెలికారమున్ హృదయనిర్మలమైనది వాక్యధోరణీ
ధీచతురత్వమున్ నరపతిప్రకటోన్నత భావరమ్యమై
తోఁచిన దేమి మిత్రుఁడవు తోఁచితి తమ్ముఁడు నీవు నాకు దో
శ్శ్రీ చెలువారు వేఱయిన చేతులుగాఁగఁ జతుర్భుజత్వమై.
క్షితిసుత నేమియైన వెదకింతును దెత్తునటన్న మాట నీ
మతి పరికింపగా నతిప్రమాణము నీ వనినట్లు నాపయిన్
గతమయి నాకులేద యధికారము జానకి యేలుచుండెఁ ద
త్కృతముగ మీరలేలుదురు కేవల మీ విరహార్తునిన్ననున్.
సుగ్రీవుడు మాట్లాడిన దుఃఖోపశమన వాక్యాలు శ్రీరాముని హృదయం లోనికి చొచ్చుకుపోయాయి. ఆయన సుగ్రీవుని మైత్రీబంధానికి ముచ్చటపడ్డాడు. అందుచేత ఇలా అన్నాడు.
" మిత్రమా! నీది గుండె లోతుల్లో నుంచి వచ్చిన నిర్మలమైన స్నేహం. ఇక నీ మాట తీరు, ధైర్యం, చతురత సమ్మిళతమై, ఒక రాజు ఎంత భావరమ్యంగా మాట్లాడుతాడో, అట్లా మాట్లాడినట్లుంది. ఆహా ! ఏం స్నేహితుడివయ్యా ! నాకు తమ్ముడిలాగా అనిపించావు. నువ్వు, లక్ష్మణుడు, నా బాహుబలాన్ని పెంచుతూ, నాకు ఇంకొక రెండు చేతులు వచ్చినట్లుగా, చతుర్భుజత్వం వచ్చినట్లుగా అనిపిస్తున్నది..
ఏదేమైనా కూడా సీతమ్మను వెతికి తెచ్చిస్తానని నువ్వు చెప్పింది చిత్తశుద్ధితో చెప్పిన మాట. నువ్వన్నట్లు నా మీద నా కధికారo లేదన్నది నిజం. ఇప్పుడు నా మీద అధికారం జానకిది. ఆ విధంగా సీతాన్వేషణ పరంగా, ఆ అధికారం మీ చేతుల్లోకి వచ్చింది. నేను కేవలం విరహంతో బాధపడుతున్నవాడిని. "
రామసుగ్రీవుల మైత్రీబంధాన్ని బలపరిచే మరికొన్ని పద్యాలివి. జానకీవిరహంతో బాధపడుతున్న రామునికి, లక్ష్మణునికి తోడు, ఇంకొక తమ్ముని వంటివాడు దొరకటం, అతడు సీతాన్వేషణకు పూనుకొనటం, రామకథలో కీలకమైన మలుపన్నది విస్మరించరానిది.
ఇంకొక చమత్కారమైన విషయం. శ్రీరాముడు శ్రీమహావిష్ణువు అవతారం. మహావిష్ణువు శంఖచక్రగదాద్యాయుధాలను ధరించే చతుర్భుజుడు.
ఈ పద్య్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా ఖాండము, నూపుర ఖండము లోనివి.
No comments:
Post a Comment