రాజే పాము నిజంబుగా భరతుఁడో రాముండొ యెవ్వండొ ! వి
భ్రాజచ్ఛాపకలావిలాసనిధియౌ రాముండె రాజౌట మేల్
రాజై నీ భరతుండు నా భరతుడు రాఁదీయునో స్వర్గముల్
రాజై రాముఁడు నంపవాదర సముద్రాంభస్సు లింకించెడున్.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండములో విశ్వనాథ ఆవిష్కరించిన కైకేయి పాత్ర, వాల్మీకిహృదయాన్ని అర్థం చేసుకొని ఒక రామాయణభాష్యకారునిగా వారు చేసిన వ్యాఖ్యానము.
తాను చేసిన దీర్ఘోపన్యాసానికి ఏ మాత్రం చలించని కైకేయి నిర్మల చిత్తాన్ని చూసి దెబ్బతిన్న పశువులాగా మంథర కుంచించుకుపోయింది. అయినా తెప్పరిల్లి మళ్ళీ విషం నూరిపోయసాగింది. " ముఖం మీద చిరునవ్వు పులుముకొని, గుండెలో విషాన్ని దాచుకొన్న రాముడు త్రాచుపాము వంటి వాడు. రాముడు రాజైతే, నీ కొడుకుతో సహా, అందరి నెత్తి మీద కాలు పెట్టి త్రొక్కుతాడు. ఇక యీ సేవకవృత్తి అనే నీచమైన దుఃఖమహాసముద్రాన్ని ఎట్లా యీదుతావో? " అని సానుభూతిని కురిపించింది.
అంతా విన్న కైక, ఆమె మాటలను కొన్ని తిరస్కరిస్తున్నట్లుగా, చిరునవ్వు నవ్వి, ఇలా అన్నది.
" ఓసి మంథరా ! రాజైతే రాముడు పాము వలె మారతాడన్నావు. మరి నిజంగా భరతుడు రాజైనా అంతే కదా ! అసలు నిజంగా రాచరికమే పాము పడగ వంటిది. భరతుడే పామో, రాముడే పామో ఎవరికీ తెలుసు. కోదండకళాప్రవీణుడైన రాముడు రాజైతే ప్రజలకు మేలు జరుగుతుంది. నీ భరతుడు, నా భరతుడు అని ఇంత చెబుతున్నవే, అతడేమన్నా స్వర్గాన్ని భూమి మీదకు దింపుతాడా? రాముడు రాజై, తన శరపరంపరలతో సముద్రపు జలాలను ఇంకింపజేస్తాడు. "
మంథర చెప్పిన మాటలన్నిటినీ, కైకేయి అర్థతిరస్కృతితో విని, మందహాసం చేసిందంటే, ఆమెకు ఆ మాటలు కొంత హేతుబద్ధంగా ఉన్నా, వాటిని ఆమె పూర్తిగా అంగీకరించే స్థితిలో లేదు. రాముడు కారణజన్ముడని ఆమె హృదయాంతరాళాలలో తెలుసు. అయోధ్యా కాండములో, విశ్వనాథ కైకేయి పాత్రను క్రమ క్రమంగా రామావతార లక్ష్యసిద్ధి వైపుకు తీసుకువెళ్ళారు.
No comments:
Post a Comment