ఆ జనకుండు పుత్రవిరహంబు సహింపఁడు ఋష్యశృంగునే
యోజనుదెత్తువో ! యతని యున్న వనంబులు దవ్వు, నేర్పుతో
రాజ ! విభాండకున్ మొఱఁగి రావలెఁ దేవలెఁ గుఱ్ఱమౌని ను
ర్వీజన తాపనోదన గరిష్ఠకళా ప్రతిభా స్వరూపునిన్.
ఎడదన్ భీతులు పొంది మౌనిఁగొనిరా నెవ్వండు ముందంజ వే
యఁడు, నే బోవను నేనుబోవ ననుచున్ ! హా ! హా ! యనావృష్టి చేఁ
జెడియున్ మృత్యువువద్దనుండియు మునిం జేరన్ భయం బంట హ
త్తెడు నేత్రంబులకున్ బొరల్ జనులబుద్ధిన్ మాయ యట్లేకదా !
అంగదేశానికి రాజు రోమపాదుడు. దేశంలో తీవ్ర అనావృష్టి పరిస్థితులు ఏర్పడ్డాయి. అరణ్యంలో ఉండే విభాండకుని కొడుకు ఋష్యశృంగుడిని అంగదేశానికి తీసుకువస్తే గానీ మరల వానలు కురవవని మంత్రులు, పురోహితులు చెప్పారు.
ఋష్యశృంగునికి స్త్రీపురుష భేదం తెలియకుండా తండ్రి అతని నట్లా పెంచాడు. ఆ మునిబాలకుడికి తండ్రి, అగ్ని - వీరిద్దరే తెలుసు. అతనెప్పుడూ అడవి దాటి బయటకుపోయి ఎరుగడు. అటువంటి ఋష్యశృంగుడిని నగరానికి తీసుకురావాలంటే చాలా కష్టసాధ్యమైన పని. ఆ విషయాన్నే మంత్రులు, పురోహితులు రాజుకు వివరించారు.
" తండ్రి విభాండకుడు, ఋష్యశృంగుడిని విడిచి ఉండలేడు. మరి అతడిని ఏ విధంగా తీసుకువస్తావో ! అతడుండే అరణ్యప్రాంతం ఇక్కడకు చాలా దూరం. దానికి తోడు, అంగదేశం యొక్క జలదాహాన్ని తీర్చగలిగిన ఆ ప్రతిభామూర్తిని, విభాండకుడి కన్ను గప్పి, చాలా నేర్పుతో ఇక్కడకు తీసుకురావాలి.
మంత్రులు, పురోహితులు యీ మాట చెప్పగానే, మునీశ్వరుల శాపానికి గురి కావలసి వస్తుందని, " నేను పోను, నేను పోను " అని ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆహా ! అనావృష్టిచేత మృత్యుముఖంలో ఉండికూడా, మునిని చేరటానికి భయపడుతున్నారంటే, కళ్ళకు పొర కప్పినట్లు, జనుల బుద్ధిని మాయ అట్లా క్రమ్మింది కదా ! "
" హత్తెడు నేత్రంబులకున్ బొరల్ జనులబుద్ధిన్ మాయ యట్లే కదా ! " అన్నది నన్నయగారి వలె విశ్వనాథ సూక్తినిధిత్వాన్ని గుర్తుచేస్తుంది.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, ఇష్టి ఖండము లోనివి.
No comments:
Post a Comment