చనుఁ జలనంబు చిర్మెఱుపు చాలిక మబ్బుల వెన్ క నాడెనో
యన నొక లిప్త కన్న కడు నల్పపుఁగాలము నందు నాడి, సీ
తను గని తండ్రి రమ్మనియెఁ దల్లియు నున్నది వత్తునంచనన్ !
దశరథుడు కైకేయీ గృహంలో చింతాక్రాంతుడై ఉన్నాడు. భార్యను పట్టు విడవమని ప్రార్థించి భంగపడ్డాడు. సూర్యవంశానికి మచ్చ తేవటం ఇష్టం లేక, ఇచ్చిన్న మాటకు కట్టుబడక తప్పని పరిస్థితి వచ్చింది. రాముడిని వెంటబెట్టుకొని రమ్మని సుమంత్రుడిని రాముని వద్దకు పంపాడు. తండ్రి పిలిచాడన్న వార్త విన్న రాముని యొక్క అంతరంగాన్ని ఆవిష్కరించినదే, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోని యీ పద్యం.
" తండ్రి తనను పిలుచుకొని రమ్మన్నాడన్న మాట వినగానే, రామచంద్రుని యొక్క తారకల వంటి కళ్ళ లోపల, లిప్త కన్నా చాలా తక్కువ కాలం, మేఘం వెనుక చిన్న మెరుపు కదలాడినట్లుగా, చెప్పటానికి వీలుగాని ఒక వింత కదలిక వచ్చింది. రాముడు వెంటనే సీత వంక చూసి, తండ్రి రమ్మని కబురు పెట్టాడని, పినతల్లి కైక కూడా అక్కడే ఉందని, తాను వెళ్ళివస్తానని చెప్పాడు. "
రాముని కళ్ళలో కనపడిన ఆ చిరుకదలిక, దేవతలు, ఋషులు, సమాధిగతులై ఏదైతో అభిలషించారో, అది కార్యరూపం దాల్చబోతుందన్న సంతోషానికి సంకేతం. అందుకే, అతని మాటలలో, తండ్రి రమ్మన్నాడని చెప్పటమే కాకుండా, తల్లి కైక కూడా అక్కడే ఉన్నదని అనటం, కార్యసాఫల్యానికి ఇది సూచన అని అతడి భావన.
No comments:
Post a Comment