హనుమంతుండనువాఁడ వాయుజుఁడ నమ్మా ! రామకార్యార్థినై
చనుచుంటిన్ రఘురాముఁ డేక శర శిక్షాశాలి లోకాలికిన్
నను దూతం బనుచున్ సురారిపురికిన్, నాళీకపత్రేక్షణన్
జనకక్ష్మాపతి కూఁతు నెత్తుకొని రక్షస్వామి పోయెన్ మఱిన్.
ఈ యన్యాయము సేఁత చూడఁగదె యాయెవ్వాని కెవ్వానికిన్
జేయన్ జేయముకాని ముజ్జగము తీర్చెన్ గోల్తలా స్వామికిన్
నా యిందున్కిగ వత్తుఁజూచి ధరణీనాథాంగనన్ నీ బుభు
క్షాయోగ్యంబుగఁ దిందుకాని చననీ సంస్తోత్ర పాత్రాకృతీ !
అనుచు మిన్నున నాఁగక చనుచునున్న
హనుమఁగని నాగమాత యిట్లనియె నాకు
బ్రహ్మదత్తవరం బిదబ్బాయి ! నన్ను
లేరు తప్పించుకొని పోవలేర యెవరు.
హనుమంతుడు వాయువేగంతో లంక వైపుకి దూసుకు వెళ్తున్నాడు. ఇది చూసిన దేవతలు, ఋషులు, హనుమంతుడు లంకలో ప్రవేశించే సమయాన్ని లెక్క గట్టారు. సరిగా అది దుర్ముహూర్తమయింది. అందుకని వారు, సురస అనే నాగమాతను ప్రార్థించి, హనుమంతుడిని కొంచెంసేపు నిరోధించమని అడిగారు.
దానికి సమ్మతించిన నాగమాత, భయంకరాకారంతో, సముద్రాకాశాలు పట్టేటంత నోరు తెరిచి, హనుమంతుడు తప్పించుకొని పోకుండా అడ్డంగా నిలుచుంది. అప్పుడు హనుమంతుడు ఆమెకు వినయపూర్వకంగా నమస్కరించి యిలా అన్నాడు.
" నన్ను హనుమంతు డంటారమ్మా ! వాయుదేవుడి కుమారుడిని. నేను శ్రీరామచంద్రుని పని మీద వెళ్తున్నాను. రాక్షసరాజు రావణుడు జానకీదేవిని అపహరిoచుకొనిపోయాడు. ఆమెను వెతకటానికి నేను రాముని దూతగా లంకకు వెళ్తున్నాను. అమ్మా ! రాముడంటే ఎవరనుకున్నావు. ఒకే ఒక్క బాణంతో, దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసేవాడు.
ఈ అన్యాయం చూశావా అమ్మా ! ముల్లోకాల్లో ఎవరూ చేయటానికి సాహసించని పని చేశాడమ్మా యీ రావణుడు. అందుకని, సీతమ్మతల్లిని చూసి, ఇక్కడున్నవాడిని ఇక్కడున్నట్లుగా వస్తాను. ఆ తరువాత, హాయిగా, నీ కడుపునిండేటట్లుగా నన్ను తినొచ్చు. ఇప్పుడు మాత్రం నన్ను పోనీయమ్మా! నీవు చక్కగా స్తుతించదగిన దానివి. "
అంటూ, ఆకాశమార్గంలో ఆగకుండా వెళ్తున్న హనుమను చూసి, నాగమాత ఇట్లా అన్నది.
" ఆగు అబ్బాయి. ఇది నాకు బ్రహ్మదేవు డిచ్చిన వరం. నన్నెవరూ తప్పించుకొని పోలేరు తెలుసా ! "
తెలుగు పలుకుబడులని ఛందోబద్ధంగా పద్యంలో ఇమిడిపోయేటట్లుగా వాడటం సామాన్యమైన పని కాదు. విశ్వనాథ రామాయణం లోని పలుకుబడులు సహజంగా, జనసామాన్యం మాట్లాడుకునే భాషకు సన్నిహితంగా ఉండి, మహాకవి ప్రతిభకు అద్దం పడుతున్నాయి.
సురస హనుమల మధ్య జరిగిన యీ సన్నివేశం, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండములో ఉంది.
No comments:
Post a Comment