వై నను పోయి వార్ధిని హిమాద్రినిఁ జూచుఫలంబు పండు రే
లైనను నుండు మేల్కనియె యాతఁడు శీధురసోగ్రపాయి, యా
పానము తూలనాడుము విపత్తును నెత్తికిఁ దెచ్చికొంటివే.
అనిన నతఁడంతవాఁడా యటంచు నసుర
వానిపేరును చెప్పినవాఁడ వేమొ
కావనఁగ నవ్వుచును హిమగ్రావరాజు
వాలి, కిష్కింధపురి నేలు వానరుఁ డనె
నిన్నొక్కటి యర్థించెద
నిన్నాతఁడు కొమ్ములూని నింగిని విసరున్
ననుం జెప్పకు కోపము
నన్నా మీఁదికిని విసరినన్ విసరుఁజుమీ.
సముద్రుడు చెప్పిన మీదట, దుందుభి హిమవంతుడి దగ్గరకు వెళ్ళాడు. కాలి గిట్టలతో, కొమ్ములతో హిమవత్పర్వత ధాత్రిని దున్నసాగాడు . దానితో హిమవంతుడికి ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకొన్నట్లయింది. దుందుభి దున్నపోతు కదా ! వాడికేమో హిమవంతుడి కండలు చెక్కుతున్నట్లుగా అనిపించింది. హిమవంతుడు వాడిని ఎవరని అడిగాడు. దానితో వాడు
తన పేరు చెప్పి, సముద్రుడు చెప్పినదంతా చెప్పి, తనతో యుద్ధానికి రమ్మని కవ్వించాడు. దుందుభి పరమమూర్ఖుడని హిమవంతుడికి అర్థమైపోయింది. అయినా ఏడిపించటానికి, " సముద్రుడు ఎట్లా నా పేరు చెప్పాడో కానీ, నాకసలు యుద్ధమే రాదు. ఎప్పుడూ, ఋషులు, వచ్చే అతిథులు, పోయే అతిథులు. ఇదంతా ఒక గోడులే ! " అన్నాడు. దాంతో దుందుభి పక పకా నవ్వి, " ఓరి ! చూస్తేనేమో కొండంత ఒళ్ళూ, దాన్లో నలుసంత మనసా? అది సరే గాని, నాతో యుద్ధంలో చేయగల సమ ఉజ్జీ ఎవరన్నా నీ ఎరుకలో ఉంటే చెప్పు. " అని అడిగాడు.
" ఎరుగున్నావా? అంటే ఎరుగున్నాననే అనుకుంటాను. ఆయన ఇదివరకు బాగా యుద్ధాలు చేసేవాడు. ఇప్పుడు వాటి జోలికి పోవట్లేదు. ఎప్పుడూ తప్పతాగి, అడవాళ్ళ కౌగిళ్ళలో ఉంటాడు. వెళ్ళి, ఆయన్ని తాగుబోతని బాగా తిట్టు. ఆయనకు బాగా కోప మొచ్చేటట్లు మాట్లాడు. దాంతో ఆయనకు చిర్రెత్తుకొస్తుంది. ఇక ఆ తరువాత నీ అదృష్టం. " అని హిమవంతుడు ఎక్కడలేని వినయాన్ని నటిస్తూ చెప్పాడు.
" అబ్బో ! అంతవాడా? ఇంతకీ వాడి పేరు చెప్పావు కాదే? " అని అడిగాడు దుందుభి.
ఏదో రహస్యం చెబుతున్నట్లు, " ఆయన పేరు వాలి, కిష్కింధాపురి నేలే వానర రాజులే ! " అన్నాడు.
దుందుభి వెకిలిగా నవ్వుతూ, దక్షిణదిక్కుగా వెళ్తుంటే, వాడిని కొంచెం సేపు ఆపి, " నాయనా ! పొరపాటున నా పేరు గాని చెప్పేవు? ఆ కోపంలో, ఆయన నిన్ను నా మీదికి విసిరినా విసురుతాడు. " అని బతిమాలుతున్నట్లు నటిస్తూ, బాగా ఉసిగొల్పాడు.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, నూపుర ఖండము లోని యీ సన్నివేశం, సముద్రుడికి దుందుభికి మధ్య జరిగిన ఆసక్తికర ఉదంతం లాగానే, దుందుభి మూర్ఖత్వాన్ని మరింతగా తెలియజేస్తున్నది.
No comments:
Post a Comment