హనుమ కొక్క యూహ తనరారె నెడఁదలో
నురక పెరిఁగి వందయోజనములు
పెరిగి కాలు లంకఁబెట్టినఁ జాలదే
సంద్ర మెగురు టనవసర మటంచు.
హనుమంతుడు బుద్ధిమదగ్రగణ్యుడు. సూక్ష్మగ్రాహి, ఆలోచనాశీలి. ఆ కారణంగానే, నాగమాత సురస పట్టును చెల్లించటానికి, ఆమె శరీరాన్ని ఎంత పెంచితే, దానికి రెట్టింపు తన మేను పెంచాడు. చివరకు, ఆమె వంద యోజనాల మేర శరీరాన్ని పెంచగానే, బొటనవ్రేలంత వాడయి, వేగంగా ఆమె వదనగహ్వరంలో ప్రవేశించి, తిరిగివచ్చి, ఆమె మన్ననను, దీవెనలను పొందాడు.
తిరిగి ఆకాశమార్గంలో, సముద్రంపై ప్రయాణాన్ని కొనసాగించిన హనుమకు, ఒక వింత ఆలోచన వచ్చింది. ఊరకే వంద యోజనాల మేర దేహాన్ని పెంచి, లంకలో కాలు పెడితే సరిపోతుంది కదా! ఇంత శ్రమపడి సముద్రం మీద ఎగరటం అనవసరమనిపించింది.
ఆంజనేయునికి ఇతరులు చెప్పేటంతవరకు తన శక్తియుక్తులు తెలియవు. సముద్రోల్లంఘనానికి జాంబవంతుడు హనుమను ప్రేరేపించటమే ఇందుకు నిదర్శనం. ఇంత ధీశాలి, బలపరాక్రమాలున్న హనుమ ప్రయత్నశీలుడు. ప్రయత్నం చేసి కార్యసాఫల్యం పొందటంలో ఒక ఆనందం, తృప్తి ఉంటాయి. అయితే, హనుమకు కల్గిన యీ ఊహ, విశ్వనాథ కల్పనాచమత్కృతికి చక్కని ఉదాహరణ.
ఈ సొగసైన చిన్న పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండములో ఉంది.
No comments:
Post a Comment