నన్నున్ లోనఁ దలంచినావు, కబు రందం జేసిరా నీకునున్
మిన్నున్ డిగ్గుము నీవు వచ్చితివి నా మేధంబు సాఫల్య మం
దు న్నీకున్ గబురంపుటన్ దగు సుమంత్రుండున్ సుమంత్రుండుగా.
నే నొక పక్షిమాత్రుఁడను నీ వఖిలేశుఁడ విట్లు నన్నుఁ బ్రే
మానత బుద్ధిఁ గాంతువు ధరాధిప ! నీ వన నాదు మైత్రికిన్
గానను హద్దు నీవిటుల గౌరవమాడినయంతఁ బొంగి నా
లోనన నేను గ్రొమ్మనసులోఁ బులకించుచు నుంటి మిత్రమా !
ఈ మిషవెట్టి వచ్చితిని యెంతటి కెంతటి కెంత దూర మీ
భూమి నినున్ గనుంగొనఁగఁ బుత్రులు గల్గుదురయ్య నీకు
నే నా ముని కూనలన్ గనుదునా? కనుఁగొన్నను గుర్తుపట్టువా
రే ! మఱి నీ కుమారులని యించుక చంచువు వాల్చి నవ్వుచున్.
తన పక్షాంచలమారుత
మున ఱేనికి వీవఁ, జాలుపో ! నీవా? నా
కును వీతు వంచు దశరథ
మనుజేశ్వరుఁడతని వీచె మలువసనమునన్.
ఉండుమని యెంతబలవంతమో పొనర్చె
రాజు మీ మానవులకు నా రాక యొకఁడె
వ్రేఁగు, నిలుచుట కాదని వెడలె నతఁడు
రాజునకును గన్నీళ్ళపర్యంతమయ్యె.
దశరథుడు, తాను తలపెట్టిన అశ్వమేధ యాగానికి ఋషులను, బంధువులను, మిత్రుల నందరినీ ఆహ్వానించాడు. అలావుండగా ఒకనాడు, భూమి మీద పక్షిరాజు జాడను తెలిపే నీడను చూసి, ఆకాశంలోకి తలయెత్తి చూసాడు దశరథుడు. అలా చూసిన దశరథుడు మిత్రుణ్ణి ఇలా కుశలప్రశ్న లడిగాడు..
" ఎవరు ? నువ్వు జటాయువేగా ! రా ! రా ! ఎన్నాళ్ళకు నీకు గుర్తుకొచ్చాను. నీకు కూడా కబురంద జేసారు కదా ! రా ! క్రిందికి దిగు. నువ్వొచ్చావు, నా యాగం సఫలమైనట్లే. నీకు కబురుపెట్టిన సుమంత్రుడు నిజంగా సరియైన మంత్రి. "
స్నేహితుడి ఆత్మీయతను చూసిన జటాయువు చలించిపోయి, దశరథునికి ఇలా సమాధానమిచ్చాడు.
" నేనొక మామూలు పక్షిజాతికి చెందినవాడిని. మరి, నీవో? ఈ సమస్త భూమికి ప్రభువువి. నన్ను ఈ విధంగా ప్రేమతో గౌరవిస్తున్నావు. నీతో స్నేహానికి హద్దులు లేవు. నీవు చూపిన యీ గౌరవానికి, నేను లోపల లోపల మనస్సులో పొంగిపోతున్నాను మిత్రమా !
ఏదో నువ్వు యాగం చేస్తున్నావనే కారణం పెట్టుకొని వచ్చాను గాని, నీవుండే అయోధ్యానగర మేమన్నా దగ్గరా దాపా? గుర్తుపట్టి రావటం మామూలు మాటలా? అది సరే మిత్రమా ! నీకు తప్పకుండా పుత్రసంతానం కలుగుతుంది. ఏమో ! మళ్ళీ ఎప్పటి మాటో? ఆ పసికూనలను చూడగలుగుతానంటావా? ఒకవేళ చూసినా, నీ కొడుకులు నన్ను గుర్తుపడతారా ఏమిటి? " అని ముక్కు కొంచెం క్రిందకు వాల్చి ముసి ముసి నవ్వులు నవ్వాడు జటాయువు. "
ఇలా మాట్లాడుతూ, జటాయువు తన రెక్కల చివరలతో దశరథునికి వీచటం మొదలుపెట్టాడు. స్నేహితుడిని మధ్యలో అడ్డుకొని దశరథుడు, " చాలు చాల్లే ! నువ్వా నాకు వీచేది? " అంటూ, తన ఉత్తరీయం కొంగుతో జటాయువుకు వీచసాగాడు.
ఈ విధంగా మిత్రులిరువరూ పరస్పరం స్నేహభావాన్ని పంచుకొన్న తరువాత, జటాయువు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఉండమని రాజు ఎంత బలవంతం చేసినా, మానవుల మధ్యలో ఉండటం మంచిది కాదని వెళ్ళిపోయాడు జటాయువు. రాజు కళ్ళనీళ్ళపర్యంత మయ్యాడు. "
దశరథుడు జటాయువు మధ్య జరిగిన సంభాషణ ఎంతో సహజంగా చిత్రించారు విశ్వనాథ. మూలానికి భిన్నంగా, జటాయువును యాగ సమయంలో ప్రవేశపెట్టటం వల్ల విశ్వనాథ ఒక ప్రయోజనాన్ని సాధించారు. జాటాయువు దశరథునికి చిరకాల మిత్రునిగా చిత్రించటం వల్ల, దశరథునికి ఉత్తరకర్మలు నిర్వహించ లేకపోయిన రాముడు, పితృసమానుడైన జటాయువుకు ఉత్తరకర్మలు జరిపి ఉపశమనం పొందటానికి హేతువు ఏర్పడినట్లయింది.
మిత్రుల మధ్య ఆత్మీయతా భావాన్ని పెంపొందించే ఈ సన్నివేశం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, ఇష్టి ఖండము లోనిది.
No comments:
Post a Comment