లోనన్ గుడుసుళ్ళు పందుచు మనోలోభంబొ, ధాత్రీవచో
దానక్లేశమొ, తోఁచరానిది యెదో దైవత్యమౌ ప్రేరణ
గ్లానిన్ గన్నులు చింతనిప్పుగఁ దనూకంపంబు సంధిల్లగన్.మా పనులెల్లనుం జెడుసుమా ! రఘునాయక ! యభ్ధిమేఖలా
వ్యాపృతబుద్ధివైన నని యాడిరఁటా సుర, లంతె కావలెన్
గోపన నన్నుఁగాని కయికోఁడటె ఱేఁడటులైనఁగాని యేలా
లా పతి జ్యోతిషాంపతి కులంబున మాటను వీటిఁబుచ్చెడున్.
ఓహో ! కైకయి ! నీ ప్రయోగము విధివ్యూహప్రభేదక్రియా
బాహాటంబగుఁబో సుధాంధసులునై పాలింత్రుపో నీ మతి
వ్యాహారంబులు, రామభద్రుని వనీపర్యంతముం జూచికా
నీ ! హా ! హా! పినతల్లి కైకయి మఱిన్ నిద్రించ దే నాటికిన్.
రామాయణంలో కైకేయి పాత్ర విలక్షణమైనది. లోకంలో, రాముడిని అడవులకు పంపిన దానిగా అపకీర్తి తెచ్చుకొన్న స్త్రీ. అయితే, కైకేయి రాముడిని వనవాసానికి పంపకుండా ఉంటే, సీతాపహరణం, తదనంతర, రావణ కుంభకర్ణాదుల వధ జరిగేవా? , రాముడు వేలయేండ్లు రాజ్యమేలితే, అవతార లక్ష్యం నెరవేరుతుందా? అన్న పలు నిగూఢమైన ప్రశ్నలకు వ్యాఖ్యానమే శ్రీమద్రామాయణ కల్పవృక్షము లోని కైకేయి పాత్ర చిత్రణం.
రాముడిని అడవులకు పంపి, భరతుడిని రాజును చేయాలన్న మంథర ప్రతిపాదనను మొదట వినీ విన నట్లున్నది కైక. తరువాత అర్ధతిరస్కృతి మందహాసం చేసింది. మంథర దీర్ఘోపన్యాసానికి ప్రతివాద శూన్య అయి నవ్వింది. చివరకు, మంథర ఉరి పోసుకొనటానికి ప్రయత్నించటంతో, తన మనస్సహజ దౌర్బల్యానికి వశురాలయింది. తనకు ఇష్టం లేని పని చేయిస్తున్నందుకు, కైక మనస్సులో కలిగిన వివిధ పరిణామ దశ లివి.
మందు తిన్న పులి లోపల చెప్పలేని బాధ ననుభవిస్తున్నట్లు, కైక లోపల గుడుసుళ్ళు పడుతున్నది. దానికి కారణం భరతుడిని రాజును చేయాలన్న తన స్వార్థమో, దాది మంథర కిచ్చిన మాట వల్ల కలిగిన దుఃఖమో, ఇవన్నీ కాక దేవతల ప్రేరణ చేత కలిగిన దౌర్బల్యమో, ఏది ఏమైనా కానీ, కైక కళ్ళు చింతనిప్పుల్లా మారాయి. శరీరం వణకటం మొదలుపెట్టింది.
కొంచెంసేపు శిలాప్రతిమలా నిలబడి, ఒక్కసారి పెద్దగా, వికృతంగా నవ్వి, ఇలా అన్నది.
" దేవతలందరూ వెళ్ళి , రాముడు కనుక రాజ్యాన్ని ఏలుతూ కూర్చుంటే, వాళ్ళ పనులన్నీ చెడిపోతాయని అన్నారట. అంతే కావాలి. ఇక, నేను కోపిస్తే గాని రాజు నా మాట వినడట. సూర్యవంశంలో పుట్టిన నా భర్త, నాకిచ్చిన మాట తప్పుతాడా?
ఓ ! కైకేయి ! రాముడిని వనవాసానికి పంపాలన్న నీ ప్రయోగం, చివరికి సృష్టికర్త బ్రహ్మ వ్యూహాన్నికూడా తలకిందులు చేసింది. నీ బుద్ధివిశేషాన్ని దేవతలు తప్పకుండా మెచ్చుకుంటారు. రాముడిని అడవులకు పంపించేటంతవరకు, పినతల్లి కైక నిద్రపోదు. "
ఈ విధంగా మనోవ్యాకులత చెందిన కైక, నగలన్నీ తీసివేసి, కోపగృహంలో ఒక సన్నని దుప్పటి కప్పుకొని, మలిసంజలో పొదమాటున దాగిన ఆడపులిలాగా వేడి నిట్టూర్పులు విడవసాగింది.
రావణుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మ నుండి దాదాపు చావు లేకుండా వరాలు పొందాడు. కైక రాముడిని వనవాసానికి పంపటం ద్వారా, రావణవధకు, బీజం నాటినట్లై, విధి వ్యూహానికి, ప్రతివ్యూహం పన్ని నట్లయింది. అందువల్ల, కైక చేసిన పని దేవతలు మెచ్చేటటువంటిది. లోకందృష్టిలో మాత్రం, కొడుకును రాజును చేయాలని సవతితల్లి పన్నిన ఎత్తుగడ.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోనివి.
No comments:
Post a Comment