ధీశుల్ ధర్మపుగ్లానియై చెలఁగు నెందెందందునందున్ సమా
జ్ఞా సంపన్నము నార్జవంబు సుసంపన్నంబౌ గతిన్ జేఁత తా
రా సూర్యంబగు నిత్య ధర్మమయి నిత్యంబై విడంబించెడున్.
సుగ్రీవుడు రామునికి తాను ఋష్యమూకపర్వతం మీద ఎందుకు తలదాల్చుకోవలసి వచ్చిందో వివరిస్తూ, దుందుభి కథను చెప్పాడు. వాలి తనను రాజ్యం నుండి బహిష్కరించటమే కాక, తన భార్య రుమను బలవంతంగా గ్రహించటం కూడా చెప్పాడు.
అంతా విన్న రాముడు, వాలి రెండు విధాలుగా శిక్షార్హుడని, దాని కారణంగా అతడికి విధించే శిక్షలు రెండు విధాలుగా ఉంటాయని చెప్పాడు. సోదరుడని కూడా చూడకుండా, చేయని తప్పుకు, సుగ్రీవుడిని రాజ్యం నుండి బహిష్కరించటం మొదటి తప్పు. పశుకామంతో, సోదరుని భార్యను గ్రహించటం రెండవ తప్పు. ఈ రెండింటికీ రెండు రకాలైన శిక్ష లుంటాయని ధర్మనిర్ణయం చేశాడు రాముడు. వాలి సగం మృగం, సగం మనిషి కనుక రెండు శిక్షలు వర్తిస్తాయని చెప్పాడు. వాలి అధర్మ ప్రవర్తనకు, రాజుగా అతనిని శిక్షించటం, మృగమైనందున, ఆ శిక్షను మృగాన్ని చంపిన రీతిలో ప్రవర్తిల్లచేయటం. దానిని దృష్టిలో పెట్టుకొని, రాముడు ఇలా అన్నాడు.
" ఈ సమస్త భూవలయానికి ప్రభువులు ఇక్ష్వాకువంశం వారు. ఎక్కడెక్కడ ధర్మానికి హాని జరుగుతుందో, అక్కడ వారి ఆజ్ఞ చక్కగా పాలింపబడేటట్లుగా, ఋజువర్తనం సుసంపన్న మయ్యేటట్లుగా చేయటం వారి విధి. ఆ విధంగా చేయటం వలన ధర్మం ఆచంద్రతారార్కమై, నిత్యమై వర్థిల్లుతుంది. "
ధర్మప్రతిష్ఠాపన అనేది రామావతార లక్ష్యాలలో ఒకటి, అత్యున్నతమైనది. అందువలన, వాలి విషయంలో, రాముని ధర్మనిర్ణయం, బాహ్యంగా అధర్మమని అనిపించినా, ధర్మసూక్ష్మం తెలిసినవారికి, ఇది సమంజసమైన నిర్ణయమని తెలుస్తుంది.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, నూపుర ఖండము లోనిది.
No comments:
Post a Comment