ప్రారబ్ధం బొకడేదియో కలిగి తా రాజన్యవంశంబునం
దారూఢిన్ జనియించెనన్న కలితోహం దాను వైదేహి వి
స్ఫారాక్షుల్ జలజాతముగ్ధములుగా భర్తన్ విలోకించెడున్.
మున్యాశ్రమవాసులు సీతారాముల ప్రతి దైనందినచర్యనూ, వారి మధుర శృంగారలీలా విశేషాలుగా చెప్పుకొంటూ, వారిద్దరూ దంపత్య జీవితానికి ప్రతీకలుగా, విడదీయరాని జంటగా, వారున్న ప్రదేశం వైకుంఠసదృశంగా, కథలు కథలుగా చెప్పుకోసాగారు. ఈ విధంగా రాముని అరణ్యవాస కాలం ఒక దశవర్ష సత్రయాగం లాగా సాగింది. విడవలేక విడవలేక విడిచిన సుతీక్ష్ణుని ఆశ్రమం వైపుకి రాముని మనస్సు లాగింది. అక్కడకు వెళ్ళిన తరువాత, పాత చుట్టరికాలన్నిటినీ ఒకసారి తిరగవేసి, ఆశ్రమవార్తల నన్నిటినీ కథలు కథలుగా చెప్పించుకొని విని, సంతోషంతో ఉప్పొంగిపోయాడు రాముడు. ఆశ్రమవాసులు పదేండ్లనాటి కథలన్నీ చెప్పినవే మళ్ళీ చెప్పుకోసాగారు. ఎన్నిసార్లు చెప్పినా, విన్నా, వాళ్ళకు తనివి తీరటం లేదు. ఆశ్రమవాసులకు, రాముని మధ్యనున్న ప్రేమబలం చేత, వారి మాటలతీరు, వారి గుండెలోతుల్లో ఉన్నటువంటి ఆర్ద్రత చూసిన సీత, రాముడిని గురించి యీ విధంగా భావన చేసింది.
" ఈ రాముడు పూర్వజన్మలలో ఎవరైనా మునీంద్రుడా? ఏదైనా బలవత్తరమైన ప్రారబ్ధకర్మ చేత రాజవంశంలో పుట్టాడా? "
రాముని గూర్చిన ఈ ఊహలతో సీత, వికసించిన తామరల వంటి కళ్ళతో భర్త వంక చూడసాగింది.
సీతారాములు భారతీయ దాంపత్య జీవనానికి ప్రతీకలు. ఆశ్రమవాసులందరికీ అదే భావన కలిగింది. ఇక, మునులతో రాముని సాన్నిహిత్యాన్ని చూసిన సీతకు, రాముడు పూర్వజన్మలలో మునీంద్రుడేమో నన్న ఊహ కలగడంలో ఆశ్చర్యం లేదు. మునుల మాట వినగానే రాముని మనస్సు పులకించిపోతుంది. విశ్వనాథ రాముని శిల్పాన్ని మలచిన తీరులోని ఒకానొక పార్శ్వమిది.
No comments:
Post a Comment