పల బహుళార్థ సంగ్రహణ బంధుర ధీకులు మీకునంతగాఁ
దెలిసిన నేలకాదనుట? తీర్థము స్వార్థము కూడివచ్చినన్
వలదననేల? మీకు వశవర్తినిగా నడతున్ బ్రియంబునన్.
విరాధుడు చెప్పినట్లుగా, సీతారామలక్ష్మణులు శరభంగాశ్రమానికి వెళ్ళారు. అక్కడ, శరభంగ మహర్షి శరీరత్యాగాన్ని చూడటానికి, ఆ అరణ్యప్రాంతంలో ఉండే సర్వమునులు వచ్చారు. వారందరూ రాక్షసుల చేతిలో పడుతున్న బాధలను విన్నవించుకొని, శ్రీరాముడిని వారికి రాక్షకుడిగా ఉండమని కోరారు. దానికి సమాధానంగా రాముడు వారికిచ్చిన వాగ్దానమే ఈ పద్యం యొక్క భావం.
" తండ్రి ఆజ్ఞ ననుసరించి నేను అరణ్యానికి వచ్చాను. మీరందరూ దానిలో ఉన్న అనేకమైన ప్రయోజనాలను ఒప్పిదమైన రీతిలో అర్థం చేసుకోగలిగిన బుద్ధిశాలులు. వనాలకు నేను రావటం వెనుక నున్న ఇన్ని విషయాలు తెలిసిన మిమ్మల్ని కాదనటం యెందుకు? మీకు రక్షణగా నేనుండటం వల్ల, స్వామికార్యం, స్వకార్యం నెరవేరుతున్నప్పుడు వద్దనటం యెందుకు? అందువలన, మీకు సంతోషాన్ని కలిగిస్తూ , మీరు చెప్పినట్లు చేస్తాను. "
శ్రీరాముడు అవతారమూర్తి. రామావతార లక్ష్యం రావణకుంభకర్ణుల వధ. ఆ ప్రధాన లక్ష్యంతో పాటు, ఋషుల తపస్సులను, యాజ్ఞయాగాదులను భగ్నం చేస్తున్న దైత్యులను సం హరించటం, శాపవిమోచన కోసం ఎదురుచూస్తున్నవారికి విముక్తి కలిగించటం, ఆశ్రయించినవారికి శరణాగతిని ప్రసాదించటం వంటి చాలా పనులు అంతర్లీనంగా ఉన్నాయి. అందుకనే, రాముడు మునులను " బహుళార్థ సంగ్రహణ ధీకులు " అన్నాడు. ధర్మ పరిరక్షణ తన కర్తవ్యంగా భావించే రాముడు ఋషుల భావనను మన్నించటం సహజం.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనిది.
No comments:
Post a Comment