ఋషిలోక ప్రథమావతారుఁడు జగచ్ఛ్రేణీనిరంతోగ్రఁక
ల్మషసంక్షాళన హేతుసంతత తపోమాహాత్మ్యపుంజప్రభా
సుషమామూర్తి, వశిష్ఠుఁడే నృపగృహస్థున్ గొల్చియుండున్ ననున్
హృషితుండై కనవచ్చునంట సముద్రము లేరీ? నాకు ధాత్రీశులన్.
వశిష్ఠ మహర్షి ఋష్యశృంగుడిని దశరథ మహారాజు చేసే అశ్వమేధయాగానికి అధ్వర్యం వహించమని ఆహ్వానించటానికి అంగదేశానికి వస్తున్నాడని తెలుసుకొన్న రోమపాదుడు పరమానందభరితుడయ్యాడు. ఆయన, తన భాగ్యాన్ని తలచుకొని ఈ విధంగా తలపోస్తున్నాడు.
" ఋషి లోకానికి ఆద్యుడైనవాడు, జగత్తులో విచ్చలవిడిగా పెరిగిపోతున్న పాపాలను కడిగివేయటం కోసం, నిరంతరం తపస్సు చేసి, ఆ మాహాత్మ్యం చేత మిక్కిలి శోభిల్లేవాడు అయిన వశిష్ఠుడు, ఏ నృపకులానికి పురోహితుడో, ఆ మహర్షి నా గృహాన్ని పావనం చేయబోతున్నాడంటే, ఈ భూమిని పాలించే రాజులలో నా అంతటి భాగ్యశాలి ఎవరైనా ఉంటారా?
బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం సప్త ఋషులలో ఒకడైన వశిష్టుడు బ్రహ్మ రసనా ప్రదేశము నుండి పుట్టినవాడు. ఈ మహర్షి భార్య పరమపతివ్రతా తిలకమైన అరుంధతి. వీరి పలువురు కుమారులలో, పెద్దవాడు శక్తి. శక్తికి పరాశరుడు, పరాశరునికి వ్యాసుడు జన్మించారు. " వ్యాస వశిష్ఠ నప్తారం " అనే వ్యాసస్తుతిలో, వశిష్ఠుడి ప్రసక్తి ఋషి సంప్రదాయంలో ఆ మహర్షి స్థానాన్ని ప్రథముడిగా సూచిస్తుంది. వశిష్ఠుడు బ్రహ్మర్షి. తన తపఃశ్శక్తిని జగత్కళ్యాణం కోసం వినియోగించాడు. దశరథుని చేత చేయిస్తున్న అశ్వమేధయాగం కూడా అవతారమూర్తి ఆవిర్భావం కొరకే.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, ఇష్టి ఖండము నందలిది.
No comments:
Post a Comment