పితృవియోగాదులవి దుఃఖపెట్టు బిట్టు
గాని జానకి దుఃఖము కరణిఁ గావు
తల్లివరములు జానకిఁ దగులవలెనె
నిన్నుఁ దగిలినయది చాలద్దన్న యట్లు.
సర్వజీవలోక సంత్రాణశీలుండ
వంతలోన నిట్లె యటమటించు
ధరణి సర్వవలయధానుష్కరత్నంబ
వసి మొగంబె తెలియనట్టు లుందు.
విరాధుని బారిన పడ్డ జానకి తన దీనావస్థకు దుఃఖిస్తున్నది. రాముడు తనకు దగ్గరగా నడుస్తూ ఉంటే ఈ అనర్థం జరిగేది కాదుగదా అనుకొన్నది. ఏదో మాటవరసగా అన్న మాటలను ఈ విధంగా పట్టించుకుంటే, ఇక అరణ్యంలో ఏమవుతుందో, ఏమయిపోతానో అని పలువిధాల వాపోయింది సీత. తలిదండ్రులంటేనే ప్రేమానురాగాలు లేని మనిషికి భార్యంటే ప్రేమ ఎక్కడుంటుందని, ఆ బాధలో నిష్ఠురంగా కూడా మాట్లాడింది.
సీత దీనాలాపాలు విన్న రాముడు దుఃఖవివశుడయ్యాడు. కైకకు ఎంతో సేవ చేసిన సీతను ఈ దురవస్థల పాలు చేయటానికే పినతల్లి తనను అడవులకు పంపిందా అని నిర్వేదం పొందాడు.
" తండ్రిని పోట్టుకొన్న దుఃఖం భరించలేనిది. కాని, జానకీవిరహ దుఃఖం వంటిది కాదు. తల్లి కోరిన వరాలు నాకు తగిలింది చాలక, జానకికి కూడా తగలాలా? " అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు రాముడు. రాముడి దుఃఖాన్ని చూసి, ఒక్క బాణంతో విరాధుడిని మట్టిముద్దలాగా చేయగల తన అన్న, యెందుకిలా బేలగా మాట్లాడుతున్నాడని, లక్ష్మణుడికి ఆశ్చర్యం వేసింది. అన్నకు ధైర్యం చెబుతూ లక్ష్మణుడు ఇలా అన్నాడు.
" సర్వజీవలోకానికి రక్షణ కలిగించే సౌశీల్యమున్న నీవు ఈ విదంగా దుఃఖపడటం వింతగా ఉంది. ధానుష్కులలో ఉత్తమోత్తమ శ్రేణికి చెందిన నువ్వు, అసలు బాణం, కత్తి మొహం చూడనట్లు మాట్లాడుతున్నావు. "
దుఃఖం పలు విధాలుగా ఉంటుంది. మాతృవియోగం, పితృవియోగం భరించరానివి. వీటన్నిటికంటె, భార్యాబియోగం దుర్భరమయినది. సనాతనధర్మం, దాంపత్యజీవితంలోని, అర్థనారీశ్వరతత్త్వాన్ని, స్త్రీ ఔన్నత్యాన్ని బలపరుస్తున్నది.
భార్యావియోగ దుఃఖాన్ని అనుభవించి, " వరలక్ష్మీ త్రిశతి " అనే స్మృతికావ్యంలో నిబద్ధం చేసిన విశ్వనాథకు రాముడు అనుభవించిన జానకీవిరహ దుఃఖతీవ్రత తెలుసు. అందుచేత, రాముని నోట ఆ మాట పలికించగలిగారు.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.
No comments:
Post a Comment