శ్రీ చివురొత్తి రక్తిఁగొను సీమ విదేహము లేలు జోతి ధ
ర్మాచరణంబు మేల్కొలమునౌ జనకున్ బిలువంగనౌను నీ
వే చని పిల్చుటొప్పు మఱి యేరినొ పంపుట యొప్పునే యటన్.
బృహదారణ్యోపనిష
ద్విహరద్వేదాంతపురుషు వివిధ ప్రళయ
ప్రహరహృత దహరవిద్యా
ముహురాహరణప్రవీణ పుంజ్యోతిస్సున్.
తాను తలపెట్టిన అశ్వమేధ యాగానికి జనక మహారాజుని ఆహ్వానించాలని అనుకొన్న దశరథుడు, అందుకు తగిన వ్యక్తి వశిష్ఠ మహర్షి మాత్రమే అని తలపోశాడు. జనకుని యెడల దశరథుడికి గల ఆత్మీయతా భావానికి, గౌరవప్రపత్తులకు ఈ పద్యాలు నిదర్శనాలు.
" చాలాకాలం నుండి నాకు ఆత్మీయుడు, సూర్యదేవునికి శిష్యుడైన యాజ్ఞవల్క్యునికి శిష్యుడు, వేదాంతవిద్య చిగురువేసి, దానిలో ఎల్లప్పుడూ రమించే , విదేహ రాజ్యాన్ని ఏలే జ్యోతిస్వరూపుడు, ధర్మాచరణానికి కులపతి, అయినటువంటి జనకుడిని యాగానికి ఆహ్వానించాలి. మరి అది మీరే నెరవేర్చాలి. వేరెవరినైనా పంపటం ఏ మాత్రమైనా శోభస్కరంగా ఉంటుందా? .
ఆయన బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడిన వేదాంతవీథులలో విహరించేవాడు. అనేకములైన ప్రళయాలలోను చెక్కుచెదరక, శాశ్వతుడిగా, దహరాకాశంలో విహరించే పరబ్రహ్మ తత్త్వాన్ని తెలుసుకొన్న పుంరూప తేజోనిధి. "
జనకుడు నిమి వంశం వాడు. వైశంపాయనుడి శిష్యుడైన యాజ్ఞవల్క్యుడికి శిష్యుడు. సూర్యుడు గుర్రం రూపంలో వచ్చి ఇతనికి శుక్ల యజుర్వేదాన్ని ఉపదేశించాడు. ఆ విధంగా, ఇతడు సూర్యుని శిష్యుడు. వైశంపాయనుని ఆదేశం మేరకు మిథిలా నగరానికి పోయి, తన అఖండ ప్రజ్ఞతో జనక మహారాజుని మెప్పించాడు. జనకుడు ఇతనికి శిష్యుడయ్యాడు.
దహరవిద్య అనేది ఛాందోగ్య, బృహదారణ్యకోపనిషత్తులలో చెప్పబడింది. పరబ్రహ్మ తత్త్వం, హృదయమనే గుహలో ప్రతిష్ఠింపబడి ఉందనీ, సాధకుడు ఆ హృదయగుహలో కొలువున్న బ్రహ్మాన్ని ఉపాసించాలని దహరవిద్య చెబుతుంది.
జనక మహారాజు గొప్పతనాన్ని చాటిచెప్పే ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, ఇష్టి ఖండము లోనివి.
No comments:
Post a Comment