గరలీనాకృతి యొక్క రాక్షసి కడంకన్ సిం హికానామ శా
క్వర దేహుం దిని యిన్నినాళ్ళకు బుభుక్షం దీర్చుకో నెంచి గ
హ్వరవక్త్రంబును విచ్చి చూచుచును చాయాగ్రాహముం జేసినన్.
వేణ్యధస్స్థల శిలా విధృత ప్రవాహమం దింతింతగా నెదు రీఁదినట్లు
ధృష్ణు ఝంఝామరు ధృత చతుష్పథమందు నింతింతగా నెదురేగినట్లు
ఆకాశమన్న శూన్యంబైన భూతంబు కోఱలతో గుంజుకొనెడు నట్లు
ఆశితంభవ గతోహ ప్రడీనోద్యత్పరేతరాడ్దిశ కికురించునట్లు
బారకును రెండు బారలు పట్టి యుదరి
వెనుకకున్ లాగుచున్నట్లు విగతవేగుఁ
డైన హనుమంతుఁ డిట్టట్టు లరసి కాంచెఁ
దన్మహాయాతుధానిఁ బాతాళవక్త్ర.
హనుమంతుడు నాగమాత సురస దీవెన లందుకొని వియత్పథంలో మళ్ళీ ప్రయాణం కొనసాగించాడు. అలా వెళ్తున్న వానరలోకేశ్వరుణ్ణి, చాలా ఆకలిబాధతో, సముద్రంలో ఉన్న సింహిక అనే రాక్షసి చూసింది. బలిష్ఠుడైన అతడిని తిని ఆకలి తీర్చుకోవాలనుకొని , గుహ వంటి తన నోరును పెద్దగా తెరిచి, అతడి నీడను పట్టి లాగసాగింది.
అనేక జలప్రవాహాలు రాళ్ళపై నుండి జాలువారుతూ పడుతుంటే, ఆ ప్రవాహాని కెదురీదుతున్నట్లు, ఉద్ధృతమైన గాలి నాలుగు కూడళ్ళలొ వీస్తున్నప్పుడు, దానికి కొంచెం కొంచెంగా ఎదురేగినట్లు, ఆకాశమనే శూన్యభూతం తన కోరలతో గుంజుతున్నట్లు, భూమిపై నూకలు చెల్లాయన్నట్లు, యమధర్మరాజు పాలించే దక్షిణదిక్కు తనను మోసంచేస్తున్నట్లు, ఒక బార నీడను లాగితే, రెండు బారలు వచ్చేట్లు కదులుతూ, వెనుకకు లాగబడుతున్నట్లు అనిపించి, ప్రయాణవేగం తగ్గిపోయిన, హనుమ అటూఇటూ చూసేసరికి, పాతాళలోకమంత నోరు తెరుచుకొని ఉన్న సింహిక అనే రాక్షసి కనుపించింది.
ఛాయాగ్రాహిణి సింహిక వృత్తాంతాన్ని తెలిపే ఈ పద్యాలు, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.
No comments:
Post a Comment