రు కెడపి తొల్లినాటిది స్వరూపజగత్తునఁ జేతనత్వ మో
డకయ క్రియాజగత్తున జడత్వము వైఖరి చేసిపెట్టవే
ప్రకుపితశైలరాడ్డుహితృ పాణి నిమీలిత లోచనచ్ఛవీ !
జీవుడు యదార్థంగా ఆత్మస్వరూపుడు. తన స్వరూపమదే. ఆత్మ నిత్యము, చైతన్యవంతమైనది. కానీ, కర్మఫలంగా లభించిన దేహాన్ని నిత్యమని భావించి తన తొలుతటి జగత్తును మరచిపోతున్నాడు. ఇదే తలక్రిందుల తీరంటే. అందుచేత, స్వస్వరూపసంధానం కలిగించి, క్రియాజగత్తులో జడత్వం వంటి స్థితిని ప్రసాదించమని విశ్వనాథ పరమేశ్వరుడిని వేడుకుంటున్నాడు.
" పరమేశ్వరా! అయ్యో ! నేను ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నాను కదా ! నిత్యమైన, చైతన్యస్వరూపమైన తొలుతటి ఆత్మజ్ఞానాన్ని, స్వస్వరూపసంధానాన్ని పోగొట్టుకొనకుండా, ఈ క్రియాజగత్తులో, కర్మలను ఆచరిస్తూనే, నిష్కామంగా, జడుని వలె ఉండేటట్లు చేసిపెట్టు. "
జీవుడు సంసారబద్ధుడు. పశువు ఏ రకంగా అయితే కట్టుకొయ్యకు కట్టబడి, విడిపించుకొనే మార్గం లేక, దాని చుట్టూ తిరుగుతూ, ఇంకా రెండు చుట్లు ఎక్కువగా వేసుకుంటుందో, అదే విధంగా, జీవుడు తన యదార్థ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేక, ఇంద్రియలోలుడై, విషయ వాంఛలకు బానిసై, జననమరణచక్రంలో పడి తిరుగుతుంటాడు. అందువల్ల జీవుడు, తన తొలుతటి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి, క్రియాజగత్తులో, కర్మాచరణం చేస్తూనే, జడుడు యెట్లా ఉంటాడో ఆ రకంగా ఉండేటట్లు చేయమని పరమేశ్వరుడిని వేడుకుంటున్నాడు. పశువుకు కట్టుకొయ్య నుండి విముక్తి లభించాలంటే, పశుపతి అనుగ్రహం కావాలి.
శివుని పరంగా, విశ్వనాథ " ప్రకుపిత శైలరాడ్డుహితృ పాణి నిమీలిత లోచనచ్ఛవీ !" అని చాలా పెద్ద విశేషణం వాడారు. పైకి కనిపించే " బాగా కోపించిన పార్వతి చేతిని మూసినకన్నులతో చూచుటయందు రక్తి కలవాడా ! " అన్న అర్థానికి లోపల దాగి ఉన్న భావం తెలియటం లేదు. పెద్దల ద్వారా తెలియబడుతుందని ఆశిస్తున్నాను.
విస్మరించరాని ఇంకొక విషయం. ఈ ఖండాంత పద్యాలకు, నా అల్పబుద్ధికి తోచిన అర్థాన్ని మాత్రమే వ్రాశానని సవినయంగా మనవి చేసుకొంటున్నాను. విశ్వనాథ వంటి ఒక ఋషి ఆత్మనివేదన, జీవుని వేదన రూపంలో, నా వంటి అల్పజ్ఞులకు అంత సులభగ్రాహ్యం కాదు.
No comments:
Post a Comment