ఱెక్కీఁకం గొనఁజాలెఁ బో మఘవుఁడున్ శ్రీనాథ ! నీదౌ కృపా
స్పృక్కాంతిచ్ఛదఁ జేసి నాదుదెస మత్పృష్టాన నీదు కాలి గో
ర్న్నొక్కుం గన్ గొని మింటనున్న యఱచంద్రుండల్పపుం లజ్జచే
నక్కున్ ధూర్జటిమౌళినున్న తనకన్నన్ నొక్కు శోభించుటన్.
లంకలో వానరసైన్యం విడిది చేసిన తరువాత, ఒకనాడు సంధ్యావందనం ఆచరిస్తుండగా, రామునికి ధ్యానంలో అగస్త్యుడు కనుపించి, విజయప్రాప్తి కోసం సూర్యోపాసన చేయమని ఆదేశించినట్లుగా అనిపించింది. అప్పుడు రాముడు ఆదిత్యహృదయం స్తోత్రం చేశాడు. సూర్యోపాసన చేసిన రామునికి శ్రీమహావిష్ణువుతో తాదాత్మ్యం కలిగింది. శ్రీమహావిష్ణువు ధనుస్సు శార్ఙ్గం, వాహనం గరుడుడు స్వామితో తమకు కలిగిన వియోగబాధను విన్నవించుకున్నారు. గరుడుడు స్వామితో ఇలా అన్నాడు.
" లక్ష్మీవల్లభా ! స్వామీ ! అమృతకుంభాన్ని స్వర్గలోకం నుండి తీసుకొచ్చే సమయంలో, దేవేంద్రుడు నా మీద వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. నీ కృపాకటాక్షవీక్షణాల వల్ల, నా కేమీ అపాయం జరగకుండా నా రెక్కలోని ఒక్క ఈకను మాత్రమే కోల్పోయాను. నీ వాహనమైన నా మీద నీవు అవధిరోహించినప్పుడు, నా వెనుకభాగంలో నీ కాలిగోటి నొక్కు పడి అది ప్రకాశిస్తున్నది . దాన్ని చూసి ఆకాశంలో ఉన్న అర్థచంద్రుడు, శివుని తలపై నున్న తన కంటె నీ కాలిగోటి నొక్కు ఎంతో శోభాయమానంగా ఉందని, చిన్నతనంతో సిగ్గుపడి నక్కి ఉన్నాడు. "
విశ్వనాథవారి కల్పనలు పాఠకులను అద్భుతమైన ఊహల లోకానికి తీసుకువెళ్తాయి. అవి తలచుకొని, తలచుకొని పాఠకుడు ఆనందడోలికల్లో ఊగులాడుతుంటాడు. గరుడుని రెక్కలే జీవుని ఉచ్ఛ్వాసనిశ్వాసాలు. దానిపై అధిరోహించిన శ్రీమహావిష్ణువు అనంతుడైన ఆత్మస్వరూపుడు. గరుఢారూఢుడైన శ్రీమహావిష్ణువు అంటే ఆత్మసాక్షాత్కారమే.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండము లోనిది.
No comments:
Post a Comment