నేరక నిన్నుఁజెప్పినది నీకును నెక్కడఁ జెప్పిపోదునో
వారక నేనటంచతఁడు పడ్డ భయంబునును జిట్టలయ్యె నా
సార భుజాబలంబునకు సాటిగఁ జెప్పుటయున్ విచిత్రమై.
త్రావినవానికిన్ స్మృతిపథంబునయందునఁ గోఁతులాడుఁ నా
త్రావుట కోఁతియైనయెడఁ ద్రావినవానికిఁ దేలు కుట్టి
నట్లై వెడబుద్ధియై యతఁడు నెంచడు తల్లినిఁ దోడుఁ జూడ లే
దా ! విబుధుల్ సురారిపులయినంతట దైత్యుల వెళ్ళఁబుచ్చుటల్.
త్రాగని మీరు దానవులు త్రావినవారె నయంబనన్ గృధా
భోగులు మీరు చేయవలె భూమికి ధర్మవినిర్ణయంబు మీ
చేగయుఁ దెల్వి యెంతయినఁ జెప్పవలెన్ మఱి దున్నపోతవై
యీగతి వచ్చుటే తెలుపు నేమిర ! త్రావుటగూడఁ దప్పురా?
కొంచె మాలోచనము చేసికొమ్ము నీదు
తెలివి స్పష్టమ్ముగా నీకె తెలియఁగలదు
ఎచట ఘోరాంబురాశి నీవెచట నెచట
హిమగిరీంద్రంబు నాప ! నీ వెచట చూడు.
వట్టి వెఱిపప్ప క్రిందం
గట్టిరి నిన్నంచుఁ దార కై కైకొనిపో
నట్టె మగుడ దుందుభి యేను
గిట్టలతో మన్ను చిమ్మి కీశేశుపయిన్.
హిమవంతుడు చెప్పిన మీదట, దుందుభి కిష్కింధాపురికి వెళ్ళి, దుర్గద్వారం దగ్గర వికృతాట్టహాసం చేశాడు. మధుపాన మత్తుడై ఉన్న వాలికి చిర్రెత్తుకొచ్చింది. ద్వారం దగ్గరకు వెళ్ళి చూస్తే, గడ్డిపరకల్ని పళ్ళ మధ్యలో ఇరికించుకొని నములుతున్న పశువులాగా,నిల్చొని ఉన్న దుందుభిని ఎదురుగా చూసాడు. వాలిని కవ్విస్తూ, వాడిలా అన్నాడు.
" మంచి వీరుడివేలే ! బలే భయపెట్టావుగా ! ఆ మంచుగుట్ట హిమవంతుడు నీ గురించి చెప్పిన మాటను ఎక్కడ నీకు చెబుతానో అని వాడు పడ్డ భయం అంతాఇంత కాదుగా ! నా భుజపరాక్రమానికి సాటివాడివి నువ్వని హిమవంతుడు చెప్పాడు చూడు, అది ఇంకా విచిత్రం. తప్పత్రాగినవాడి మనసులో కోతులాడుతుంటాయి. మరి ఆ తాగింది, కోతి అయి, దానికి తేలు కుడితే, ఇక గంగవెర్రులెత్తిపోతాడు. అటువంటి అల్పబుద్ధి కలవాడికి తల్లీతోడు వంటివి ఉండవు. దేవతలు సురాపానానికి అలవాటుపడి రాక్షసులని వెళ్ళగొట్టడం చూడలేదా?
దుందుభి ఈ విధంగా మాట్లాడేటప్పటికి, వాలికి చిరాకు వేసి, వాడితో ఇలా అన్నాడు.
" త్రాగని రాక్షసుల కంటె త్రాగినవారే నయమన్నట్లుగా, క్రోధంతో భోగాలనుభవించే మీరు భూమి మీద ధర్మనిర్ణేతలయ్యారంటే, మీ చేవ, తెలివి ఎంతగా ఉన్నాయో చెప్పితీరాలి. సరేలే ! దున్నపోతుగా నువ్విట్లా రావటమే చెబుతున్నది నువ్వేంటో. త్రాగటం కూడా తప్పురా నీకు?
కొంచెం బుర్ర ఉపయోగిస్తే, నీ తెలివేంటో నీకు తెలుస్తుంది. ఓరి నాప ! ఎక్కడ మహాసముద్రం, హిమవత్పర్వతం, ఎక్కడ నువ్వు ! నిన్ను వెర్రి వెంగళప్ప క్రింద జమకట్టారురా ! సరిగా చూసుకో ! " అని వాలి ఇలా వాడి తలతిక్క వదిలిస్తుండగానే, తార అతడి చేయి పట్టుకొని తీసుకువెళ్ళింది. దుందుభి మళ్ళీ తన గిట్టల్తో భూమినంతా దున్ని, వానరరాజు వాలి మీద కాలు దువ్వాడు.
దుందుభి మూర్ఖత్వాన్ని తెలియజేసే ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, నూపుర ఖండము లోనివి.
No comments:
Post a Comment