అదియే చిత్రము, మున్ను మౌనులకు వేదాంతార్థచర్చాసమా
త్త దమాద్యచ్ఛతపఃక్రియాకలన, సీతారామలీలావిశే
ష దరాకూతసుధాప్రసంగములచే సంపన్నమై పొల్చె శాం
తిదమై నేఁడు, నివృత్తి కంటెను బ్రవృత్తిన్ స్వాదుతాధిక్యమై.
సీతారామలక్ష్మణులు మున్యాశ్రమాలను ఒకటి తరువాత ఒకటిగా సందర్శిస్తూ , రాక్షసుల బారి నుండి వారికి రక్షణ కల్పిస్తున్నారు. నడిరాత్రి వేళ మునులకు వింటినారి మ్రోతలు వినిపించి, ఆ తరువాత సగం నిద్రలో నుండి మేలుకున్న తరువాత కూడా, అవి సురాప్సరోసంగీతం వింటున్నట్లుగా భ్రాంతి కలుగుతున్నది.
కవి ఏమంటున్నాడో చూడండి.
" అది నిజంగా చిత్రమైన విషయం. సీతారామలక్ష్మణులు మున్యాశ్రమాలకు రాకముందు, వేదాంత చర్చలే జరిగేవి. ఆ వేదాంత చర్చలలో ఇంద్రియాలను ఏ విధంగా నిగ్రహించుకోవాలని మాట్లాడుకొనేవారు. ఆ విధంగా తపఃక్రియాచరణ ఉండేది. ఇప్పుడు సీతారామలక్ష్మణులు వచ్చినప్పటినుండి, మధుర శంఖనాదం లాగా, వారి లీలా విశేషాలను గురించి ప్రసంగాలే జరుగుతూ, వారి మనస్సులకు శాంతిని చేకూరుస్తున్నాయి. ఆహా ! మనస్సుని మరలించుకోవటంలో కంటే, మనస్సుకి తెలియజేయటంలోనే, జీవికి ఆనందం ఎక్కువగా ఉంటుందేమో కదా ! "
శ్రీరామచంద్రుడు పరబ్రహ్మ స్వరూపం. సర్వ వేదాంత చర్చలు ఆ స్వరూపాన్ని తెలుసుకోవటం కోసమే కదా ! ఇక ఆ పరబ్రహ్మ స్వరూపం ప్రత్యక్షంగా మున్యాశ్రమాలను సందర్శిస్తున్నప్పుడు వారి హృదయాలు శాంతినిలయాలు కాకుండా ఎట్లా ఉంటాయి?
పరమేశ్వర భావనను కలిగించే ఇంత చక్కని పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనిది.
No comments:
Post a Comment