పాలయమందుఁగూడ భవదంశుప్రసారము తగ్గకున్న యో
వేలుప ! నీ కులానఁ బృథివీపతి యొక్కఁడు మాటయిచ్చెనా
వ్రాలవలెన్ సుమీ తనువు వాక్ఫలపూర్తి ఘటిల్లునంతకున్.
ఏ పసికూన మాకులము నేలెడు చిన్నరివెల్గు రాముఁడా
పాపని మీఁద నొట్టిడెదఁ బ్రాఁతవరంబులు నాదు ప్రాణ రే
ఖాపరమావధిం జనిన గండరకత్తెరలైన నిచ్చెదన్
గోపన కైక రాఘవులకోవకు మచ్చను జెప్పకుండఁగన్.
దశరథుడు రాముని పట్టాభిషేక వార్త చెప్పటానికి కైక గృహానికి వెళ్ళాడు. గృహమంతా చీకటిగా ఉంది. కనపడి కనపడకుండా ఉన్న వెలుతురులో తడుముకుంటూ కైక దగ్గరకు చేరాడు రాజు. మీద చేయి వేయగానే, దుప్పటి ముసుగు తీసి, దూరంగా శోకాకృతిగా నిల్చున్న కైకను చూసి, కారణం తెలియక కళవళపడ్డాడు. ముద్దుల భార్య శోకానికి కారణ మడిగాడు. కైక కూడా " కోపాన్ని శోకంగా వర్ణించే నీ చమత్కారాన్ని మెచ్చుకొంటున్నా " నంటూ " బాణవర్షాన్ని తట్టుకొంటూ, యేటికి కోటికి లాగే గుర్రాలను అదుపులో పెట్టుకొంటూ ,మూర్ఛపోయిన నిన్ను, దేవదానవయుద్ధంలో రక్షించినందుకు ఇస్తానన్న రెండు వరాలను మర్చిపోయినట్లున్నవే? " అని అడిగింది. అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు.
" వ్రాలిన చూరుతో, చిన్న కిటికీ మాత్రమే ఉన్న ఈ కోపగృహంలో కూడా నీ కాంతిరేఖలను తగ్గకుండా ప్రసరింపచేస్తున్న సూర్యభగవానుడా ! నీ వంశంలోని ఒక రాజు ఏదైనా మాట ఇచ్చాడా, ప్రాణాలు పోవాలే కానీ, అది నెరవేర్చే వరకు ఊరుకోడు.
ఏ పసివాడైతే మా కులాన్ని వెలిగించే చిరుదీపమో, ఆ రాముడి మీద ఒట్టేసి చెపుతున్నాను. నీకిచ్చిన వరాలు నాకు ప్రాణంతకమైనా, గడ్డుసమస్యగా మారినా, రఘువంశానికి మచ్చ తేకుండా, కోపంతో ఉన్న నా ప్రియసతి కైకకు ఇచ్చితీరుతాను. "
దశరథుని సత్యవాక్పరిపాలనకు ఇది అగ్నిపరీక్ష. ఏ రాముడి మీద తన ప్రాణాలన్నీ పెట్టుకున్నాడో, మాటకు కట్టుబడి, ఆ రాముడి మీదే ఒట్టేసుకొనవలసిన పరిస్థితి ఎదురయింది. కాలగతిలో సత్యనిష్ఠను పరీక్షించే సన్నివేశాలు ఇలాగే ఉంటాయి.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోనివి.
No comments:
Post a Comment