మెచ్చరు రాజు, లూరకయ మేలిమిపూఁతల మాటలాడినన్
మెచ్చరు , ప్రాణదఘ్నమయి మిత్తికిఁ దెచ్చినఁగాని దేవతల్
మెచ్చరు, భూమిపాలకులు మెచ్చరు కోర్కులు తీర్చు వేళకున్.
గట్టిగఁ జూచి మంథరను గైకయి యిట్లనెఁ బొట్టిదానికిన్
బుట్టెఁడు బుద్ధులన్న నుడి పోలును నీ మతివైభవంబు నీ
పట్టినపట్టు నీతివిభవంబు లోకరహస్యవేత్తృ సా
మ్రాట్టుతనంబు చెల్లును సుమా ! యొక్క నీకె తలంచి చూచినన్.
ఒక పదకమ్మెత్తితివా
యొక కొలికికిఁ దేనుగలవ యుర్విసకలమున్
వికృతుఁడు విధాత నినుఁ గు
బ్జక చేసినా దానికే విచారము సుమ్మీ !
క్షితికిని నెల్ల నీ తెలివికిన్ సితచామర మొక్కఁడెల్లి యొం
డతుకులు లేని వుండవలె, నంతటిదానవు, మెచ్చవచ్చు నీ
మతి విభవమ్ము నీ సొగసు, మంథరమైన వివేకహేతుతా
న్వితవయి మంథరాఖ్యను గణించితి వూరక నీకు వచ్చెనా?
వెలగల దుస్తులను ధరించిన బిచ్చగాడికి ఎవరూ బిచ్చం పెట్టరనీ, అందువలన, నగలన్నీ తీసేసి, పాత చీర కట్టుకొని, కోపగృహంలోకి వెళ్ళమని మంథర కైకకు సలహా ఇచ్చింది. రాజైనవాడు భర్త అయితే, అతడిని ఎలా ఒప్పించాలో, మంథర కైకకు నూరిపోసింది. భర్త బెదిరించినా, బతిమాలినా, విదిలించి కొట్టాలని చెప్పింది. భర్త ఎక్కడలేని ప్రేమ ఒలికించినా కూడా, తప్పదని ఒప్పించేవరకు వదలకూడదని చెప్పింది. మంథర ఇంకా కొన్ని సూత్రాలు చెప్పింది.
" చావటానికైనా సిద్ధపడేటంత సాహసాన్ని ప్రదర్శించకపోతే, రాజులు దిగిరారు. ఊరకే పై పై మురిపించే మాటలకు మెచ్చుకోరు. దేవతలైనా, భూమిని పాలించే రాజులైనా సరే, చావు వరకూ వెళితే గానీ వరాలివ్వరు. "
అంతా విన్న కైక మంథరను తీక్షణంగా చూసి ఇలా అన్నది.
" పొట్టిదానికి పుట్టెడు బుద్ధులన్న సామెత ఊరకే వచ్చిందటే ! నీ బుద్ధివైభవం, నీ ఉడుం పట్టు, నీ నీతివిశారదత్వం, లోకరహస్యాలను ఆకళింపు చేసుకొన గల నీ సామ్రాట్టుతనము - ఇవన్నీ ఒక్క నీకే సరిపోతాయి సుమా !
ఏదన్నా ఒక పదక మెత్తావా, దాన్ని ఒక కొలిక్కి తేగల సామర్యం నీకుంది. ఆ సృష్టికర్త బ్రహ్మ నిన్ను పొట్టిదానిగా చేసినందుకే నేను విచారిస్తున్నాను.
ఈ భూమి మొత్తం మీద, నీ అంతటి తెలివిగలదానికి గుర్తింపు ఉండాలంటే, అతుకులు లేనటువంటి తెల్లని వింజామరలు ఒకటి రెండుండాలి. నువ్వంతటిదానివి. అహో ! ఏం బుద్ధివైభవం? ఏం సొగసు? నిన్ను నిజంగా మెచ్చుకోవచ్చు. వక్రమైన నీ వివేకాన్ని బట్టి మంథర అనే పేరు వచ్చింది గానీ, ఊరకే వచ్చిందా? "
వ్యంగ్యంగా కైక మాట్లాడిన మాటలు, ఆమె నిరాదరభావాన్ని సూచిస్తూ, తన కిష్టమున్నా లేకున్నా, మంథర పదకాన్ని అమలు చేయక తప్పని పరిస్థితిని తెలియజేస్తున్నాయి.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోనివి.
No comments:
Post a Comment