సౌమిత్రీ ! యది యన్నగారయిన బెల్చన్ వాడు ధర్మాఖిల
శ్రీమన్మోహనమూర్తియైన మఱి యా సేవాఫలంబెట్టిదో
రామున్ రామను గొల్చుచుం జనుమురా ! రామానుజా ! లక్ష్మణా!
పోవుచు రాముఁడీ మునులపోడుము లెల్లను జిత్రమయ్యెఁ ద
ద్భావము లింత మెత్తనగుఁ పాటికి నేమి మనోజ్ఞ సృష్టియో
యీ విధ మల్లగ్రామముల నెచ్చటఁ దోఁపదు వారలైన ధ
ర్మావృత చిత్తవృత్తులయి యక్కట నేరరు కేవలత్వమున్.
శరభంగముని శరీర త్యాగం తరువాత, సీతారామలక్ష్మణులు సుతీక్ష్ణుని ఆశ్రమానికి వెళ్ళారు. మునులకిచ్చిన అభయం మేరకు మున్యాశ్రమాలను సందర్శిస్తూ, వారికి రాక్షసబాధ తప్పిస్తూ పదేండ్లు గడిపారు. తరువాత, అక్కడ నుండి బయలుదేరి అగస్త్యాశ్రమానికి వెళ్ళటానికి సుతీక్ష్ణుని అనుమతి కోరారు. ఆ సందర్భంలో, దండకారణ్యంలో సీతారాములను, వన్యమృగాల, రాక్షసుల బారి నుండి కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్న లక్ష్మణుడిని ఉద్దేశించి ఇలా అన్నాడు.
" సుమిత్రానందనా ! లక్ష్మణా ! మామూలుగా ఎవరికైనా సహాయం చేస్తే, అది చాలా పుణ్యప్రదమైనది. అదే అన్నగారి సేవ చేస్తే, ఇక దానిని గురించి వేరే చెప్పాలా?
ఆ అన్నగారు, మూర్తీభవించిన ధర్మమూర్తి అయితే, ఇక ఆ సేవాఫలం ఎంతటిదో చెప్పశక్యం కాదు. రామానుజా, లక్ష్మణా! రాముడిని, వదినగారు సీతను సేవిస్తూ తక్కిన వనవాసకాలాన్ని గడుపు నాయనా ! "
దండకారణ్యంలో ఉన్నంతకాలం మునుల,సుతీక్ష్ణుని, ఆతిథ్యాన్ని, అభిమానాన్ని, ఆప్యాయతను, హృదయ మంజుల భావాన్ని చవి చూసిన రాముడు మార్గమధ్యంలో తమ్ముడితో ఇలా అన్నాడు.
" ఈ మునుల మనస్తత్వం చూస్తే చాలా చిత్రంగా ఉంటుంది. వారి భావాలు ఇంత మృదువుగా ఉండటానికి వారి సృష్టి ఎంత మనోజ్ఞమైనదో కదా ! ఇక్కడ ఈ మున్యాశ్రమాల్లో ఉన్నట్లుగా గ్రామాల్లో ఉండదు. మునులు కూడా ధర్మాచరాణ మీద మనస్సు లగ్నమై ధర్మగ్లానిని చూసీచూడనట్లు ఉండలేరు. "
లక్ష్మణుడిని గురించి సుతీక్ష్ణుని ప్రశంసావాక్యాలు, లక్ష్మణుని రామోపాసనను తెలియజేస్తాయి. ఇక రాముడు, మునుల సంరక్షణ పనిలో పదేండ్ల కాలం గడపటం వల్ల, అతడికి వారితో ఏర్పడిన అనుబంధాన్ని, వారి ఎడబాటు వల్ల కలిగిస్తున్న బాధను సూచిస్తున్నది.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.
No comments:
Post a Comment