ఇంతయినట్టి ధైర్యము వహించితి నీవును ధైర్య మూనవే
గొంతునఁ బ్రాణమున్న యెడ క్షోణిసుతన్ వెదకించి తెచ్చి యి
ప్పింతున యీయలేనియెడఁ బిల్వకు నన్నును నాఁదుపేరఁ బ్రా
ణాంతకమయ్యె నీదు విరహస్థితి నాకు సుమిత్రబిడ్డకున్.
తెచ్చినయట్టి ధైర్యమును దేల్పకు నీదగు పున్నెమాయె నీ
పచ్చని నీడచూచుకొని భార్యయుఁ బిల్లలుగా సుఖంపడన్
వచ్చునటంచు నెంచితిని వచ్చితి నీవుగ నీవు మైత్రికై
వచ్చినపైని నీవెవరివాఁడవు మా కధికార మున్నదిన్.
శ్రీరామచంద్రుడు సీతాదేవి నగలను చూడగానే తాత్కాలికమైన మోహావేశానికి, ఉద్వేగానికి లోనయ్యాడు. రాముని దుఃఖోపశమనం కోసం సుగ్రీవుడు ఇలా అన్నాడు.
" భార్యను, రాజ్యాన్ని పోగొట్టుకొని అతి దీనమైన స్థితిలో ఉన్న నేను ధైర్యం తెచ్చుకున్నాను. నువ్వు కూడా ధైర్యం తెచ్చుకో. నా గొంతులో ప్రాణమున్నంత వరకు, సీతాన్వేషణ చేయిస్తాను. జానకిని వెదికి తెచ్చి, నీ కిప్పిస్తాను. ఆ పని చెయ్యలేనినాడు, నన్ను నా పేరుతో పిలువవద్దు. రామా ! నీ వియోగదుఃఖం చూస్తే, నాకు, లక్ష్మణుడికి ప్రాణాలమీదికి వచ్చినట్లవుతున్నదయ్యా !
నీకు పుణ్య ముంటుంది. ఆ ఉన్న కాస్త ధైర్యాన్ని పోగొట్టుకోకు. నీ పచ్చని నీడ చూసుకొని, భార్య పిల్లలతో సుఖపడదామనుకుంటున్నాను. రామా ! నీ అంతట నీవు నా స్నేహాన్ని కోరి వచ్చావు (చాలా సంతోషంగా ఉంది). ఇక వచ్చిన తరువాత నువ్వు ఎవరివాడివి (మా వాగ్వ్డివి). నీ మీద మాకా హక్కు ఉంది. "
సుగ్రీవుని ప్రియవచనాలు, ఎంత గుండె జారిపోయినవాడికైనా ఊరట కలిగిస్తాయి. విశ్వనాథవారు తెలుగు నుడికారంతో, జనజీవితంలో ఉన్న సహజమైన ప్రేమానురాగాలని పండించారు. " గొంతున ప్రాణ మన్న యెడ, పిల్వకు నన్నును నాదు పేర, ప్రాణాంతకమయ్యె, నీ దగు పున్నెమాయె, నీ పచ్చని న్ నీడ చూసుకొని, వంటి తెలుగు లోగిళ్ళలో వాడబడే మాటలు, ఇరువరి మధ్య గల ఆప్యాయతానుబంధాలని ఇనుమడింపజేస్తున్నాయి.
ఇంత చక్కని పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, నూపుర ఖండంలో ఉన్నాయి.
No comments:
Post a Comment