ఇటఁ గల రాక్షసాళికిఁ బదింతలు నిర్వదియింతలున్ సము
త్కట కపిసేన, యిందుఁగల కాయలు దుంపలు నాకులెల్ల ని
ష్కుటముల వృక్షసస్యములు కూఁకటి వ్రేళ్ళుల బెల్లగించు, న
ప్పటికి నిశాటకోటి తినుపాటికి వార్నిధి నుర్వు దక్కెడున్.
ఏడు గడియలు బ్రహ్మాస్త్ర మెవనిఁబట్టు
వాని మెడఁగోయవలయు నాపట్టునందు
నాతనిది వజ్రకాయమై యతని గళము
కత్తివాదరఁ దెగనిది కానువచ్చు.
ఇంతకు రామలక్ష్మణులు నెట్టిరొ సంగరమాడకుండ వృ
త్తాంతము లేమియుం దెలియ వప్పుడు దుర్ఘట మైనయట్టి వృ
త్తాంత మెఱింగియున్ ఫలమునందది చాలదటంచు నవ్వి యీ
యింతటి చిక్కు కూర్పు వెలయించిన వారిజనాభు మెచ్చుచున్.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండములోని యీ ఖండము పేరు సంశయ ఖండము.
విశ్వనాథ తన అద్భుతమైన కల్పనాచమత్కృతితో, రావణుని ఇష్టదైవమైన శివుడు హంసరూపంలో, సీతారాముల మధ్య రాయబారం నెరపటమనే సన్నివేశాన్ని సృష్టించారు. దీనితో, రావణుని మదిలో పలు సంశయాలు మొలకెత్తాయి. అసలు శివుడు తన కులదైవమా? లేక లోకుల దైవమా? అనే సందేహం వచ్చింది. రాముడు, శ్రీమహావిష్ణువు యొక్క అవతారమా? అని ఇంకొక సందేహం. ఈ పద్యాలలో ప్రస్ఫుటమయ్యే రావణుని ఉగిసలాడే మనస్సును ఇప్పుడు పరిశిలిద్దాం.
" ఇక్కడ లంకలో కల రాక్షససేనకు పదింతలో, ఇరవై రెట్లో వానరసేన ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ గల కాయలు, దుంపలు, ఆకులు మొదలైనవన్నీ త్రుంపివేసి, చెట్లన్నీ కూకటివేళ్ళతో పెళ్ళగించేటట్లున్నారు. ఇక అప్పటికి రాక్షససైన్యానికి తినటానికి సముద్రపు నురుగు తప్పితే ఇంకేమీ మిగలదు.
వాళ్ళ సైన్యంలో ఎవరికి వారే అజేయులుగా ఉన్నారు. అందుకనే, బ్రహ్మాస్త్రం ఏడు గడియలు బంధించి ఉంటుంది కనుక, ఆ పట్టులోనే వాళ్ళ మెడలు తెగకోయాలి. ఒకవేళ, వాడి మెడ వజ్రసమానంగా ఉండి, కత్తిదెబ్బకు తెగకుండా కూడా ఉండొచ్చు.
ఇంతకూ, రామలక్ష్మణులు ఎట్లాంటి వారో ? యుద్ధం చేయకుండా, వాళ్ళ శౌర్యపరాక్రమాలు ఎంతటివో తెలుసుకోలేము. తీరా యుద్ధంలో, వారి దుస్సహమైనటువంటి పరాక్రమం తెలిసినా ఏం లాభం? " అని తలపోయగానే, రావణుడికి నవ్వు వచ్చి, ఇంతటి చిక్కుముడిని పెట్టిన బ్రహ్మ కూర్పును మెచ్చుకొన్నాడు.
ఈ ఖండంలో రావణుని అంతర్మథనం, ఆధునిక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల ఆవిష్కరణ లాగా, పాఠకుల మేధస్సుకు పదును పెడుతుంది.
No comments:
Post a Comment