జటలున్ వల్కలముల్ పృషత్కములునుం జాపంబు లీ సంధిదు
ర్ఘటవేషంబుల నేరి మోసపఱుపంగాఁ గూర్చు టష్టాపద
చ్ఛట దేహామలకాంతి రత్నమయభూషాహేమచీరాదు లొ
ప్పుట నంతఃపురయోగ్య నాగరకురా ల్పూబోఁడి తానీమెయున్.
ఏ యంతఃపుర మీరు కొల్లయిడి యిష్టేచ్ఛామహాభోగలీ
లాయత్తం బువుబోఁడి దొంగిలితి రేలా వచ్చుటో రాక రాకీ
యుర్వీస్థలి యొక్కడే దొరకెనా? యెచ్చో విరాధుండు మౌ
న్యాయుర్దక్షిణ దిఙ్మహేశ్వరుడు సంహారాభూతుం డుండెనో.
నా మూఁపుంబడి యిన్పయీటె యిదికన్నారే మిముం గ్రుచ్చఁగా
నేమూలౌ మఱి యేదొ త్రోవఁ జనకిట్లే రాకయున్ మేలె, తా
నీ మందాక్షదృశాంత కావలయు నా కిల్లాలుగా, మీరనన్
మీ మాసంబు భుజిక్రియాంత రసనా మృష్టంబగున్ నంజుకో.
ఈ నడుమన్ దపస్విజన మెవ్వరు రారిట పూఁటపూఁట బ్రా
చీనము నేన్గుపచ్చియెఱచిన్ దినఁజాలక మొత్తిపోయె నో
హో నరమాంసఖాది పులియున్ రుచి, యచ్చమనుష్యమాంస మెం
తైన రుచో వచింపనగునా ! మఱి స్నానము చేసి రండిఁకన్.
సీతారాముల మధ్య వచ్చిన చిన్న మాట పట్టింపు వల్ల, వారిద్దరూ ఎడమొగం, పెడమొగంగా, దూర దూరంగా నడిచి వెళ్తున్నారు. ఇంతలో, విరాధుడనే రాక్షసుడు సీతను చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. విముఖుడై వెళ్తున్న రాముడు, విరాధుని వికటాట్టహాసం విని వెనక్కి తిరిగి చూసాడు. భయంకరమైన ఆకారం గల ఒక రాక్షసుడు సీతను హఠాత్తుగా పట్టుకొన్నాడన్నది రామలక్ష్మణులను నిశ్చేష్టులను చేసింది. ఆ హఠాత్పరిణామం నుంచి తేరుకొని, రాముడు ఆ రాక్షసుడిని మాటలలోకి దించి, వాడెవరని అడిగాడు. దానికి వాడు వికవికా నవ్వి, విరాధుని పేరే వినలేదా అని గద్దించి, వారితో ఇలా అన్నాడు.
" జీబురుగా ఉన్న మీ జడలు, కట్టుకున్న నారచీరలు, బుజాలకు వ్రేలాడుతున్న ,
ధనుర్బాణాలు - అటు బ్రాహ్మణులా లేక క్షత్రియులా అని పోల్చుకోవటం కష్టమయ్యే ఈ వేషమంతా ఎవరిని మోసం చేయటానికి? మీరేమో మేలిమి బంగారం రంగులో మెరిసిపోతున్నారు, ఇక ఈమెను చూస్తే రత్నమయమైన సువర్ణాభరణాలు పెట్టుకొని, అంతఃపురంలో ఉండే నాగరికురాలులాగా కనపడుతున్నది. ఏ అంతఃపురం కొల్లగొట్టి హాయిగా భోగాలనుభవించటానికి యీ సుకుమారిని దొంగతనంగా ఎత్తుకొచ్చారు? వచ్చారు సరే ! ఏ ప్రాంతంలోనైతే మునుల ప్రాణాలను యీ విరాధుడు, దక్షిణ దిక్కుకు అధిపతి అయిన యముడి లాగా హరిస్తూ ఉన్నాడో, ఆ ప్రాంతమే మీకు కావలసివచ్చిందా? నా వీపున వ్రేలాడుతున్న యీ ఇనుప ఈటెను చూడండి. దానికి గుచ్చితే, మీరు దాని ఒక మూలకు కూడా రారు. ఏదో ఇంకొక దారిలో పోకుండా, ఇట్లా రావటం మీకు హానికరం కదా! అది సరే. ఈ సిగ్గులమొగ్గ నాకు ఇల్లాలు కావాలి. ఇక మీ సంగతంటారా? మీ మాంసం, భోజనం చివరలో నంజుకోవటానికి బలే బాగుంటుంది. ఏమిటో ! నాకు భయపడి మునులెవ్వరూ ఈ మధ్య ఇటువైపు రావటం లేదు. ప్రతిరోజు ఏనుగు పచ్చిమాంసం తిని మొహం మొత్తింది. అబ్బ ! నరమాoసం తినేటటువంటి పులి యొక్క మాంసం బాగా రుచిగా ఉంటుంది. ఇక అచ్చంగా నరమాంసం సంగతి వేరే చెప్పాలా? ఊ ! ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్నానం చేసి రండి. "
విరాధుని మాటల్లో రెండు జీవలక్షణాలు కనిపిస్తాయి. అతడు శాపగ్రస్తుడైన గంధర్వుడు. అందువల్ల, గంధర్వుని జీవలక్షణం అంతర్నిహితమై ఉండగా, బాహ్యంగా పైశాచిక జీవలక్షణం కనపడుతుంది. అతనిలో దాగి ఉన్న గంధర్వ లక్షణం, అతని చేత " అష్టాపదచ్ఛటదేహామలకాంతి, రత్నమయభూషాహేమచీరాదు లొప్పుట నంతఃపురయోగ్య నాగరికురా ల్పూబోడి తా నీమెయున్. " అన్న మాటలను చాలా సంస్కారవంతంగా పలికించాయి. అయితే, అతడు శాపావసానం కోసం ఎదురుచూస్తున్న వాడే కాక, రాక్షసుని దేహాన్ని దాల్చినవాడు. దేహధర్మంగా, రాక్షస ప్రవృత్తి అతనికి సహజం. కాబట్టి దేహసంబంధమైన మాటలు కూడా అతని నుండి వినిపిస్తాయి. ఈ రెంటినీ సమన్వయం చేస్తూ, విరాధుని పాత్రను తీర్చిదిద్దటమే విశ్వనాథ గాఢప్రతిభకు నిదర్శనం. విరాధుని జీవసంపుటిలో గత జన్మ యొక్క ఆత్మను మాత్రమే ప్రతిబింబింప జేస్తే, అది అసహజమై, ప్రస్తుత రాక్షస ప్రవృత్తికి విరుద్ధంగా ఉంటుంది. ఒక్క రాక్షసప్రవృత్తిని మాత్రం చిత్రిస్తే, అది విరాధుని శాపావసానానికి ప్రతిబంధకమౌతుంది. విరాధుని పాత్రచిత్రణలో ప్రస్తుత రాక్షస ప్రవృత్తి అనుభవనీయమౌతూనే, గతజన్మ స్పృహనీయం కావాలి.
అదే మహాకవి విశ్వనాథ చేసింది.
రామాయణ కల్పవృక్షగత విరాధుని పాత్రను అర్థం చేసుకొనటంలో కీర్తిశేషులు కేతవరపు రామకోటిశాస్త్రిగారి " విశ్వనాథ వైఖరి " అనే విమర్శన గ్రంథంలోని వారి " విరాధ వధ " వ్యాసం ఎంతో ఉపకరించింది. భావాలన్నీ వారివే, వట్టి భాష మాత్రమే నాది.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.
No comments:
Post a Comment